హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలుచేస్తున్నదని, కానీ కార్మిక సంఘాల నాయకులు కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులు, ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎన్నికలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో శనివారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార నేతృత్వంలో తాను, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ల తో కలిసి సీఎస్, సీనియర్ ఐఏఎస్‌లు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, సంస్థ ఉన్నతాధికారులతో పాటు ప్రతి కార్మిక సంఘం నుంచి ఇద్దరు చొప్పున దాదాపు 30మంది ప్రతినిధులతో 14గంటలు చర్చించి అందరి ఆమోదంతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గుర్తుచేశారు.
సమావేశంలో మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో, మూడు అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్టు నిర్ణయించామని మంత్రి పొన్నం తెలిపారు. యాజమాన్యం పరిధిలో ఉన్న 29 అంశాల పరిషారానికి ఈడీల కమిటీ ద్వారా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మూడు కీలక అంశాలైన ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 11శాతం జూలై నెల జీతాల నుంచే అమల్లోకి రానున్నదని చెప్పారు. కార్మికుల మొదటి డిమాండ్ గుర్తింపు సంఘాల ఎన్నికలని ఇప్పుడు మాట మార్చి పకదోవ పట్టించడం సరికాదని తెలిపారు. సంస్థ విలీనంపై విధివిధానాలు రూపొందించే కమిటీలో కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని సమావేశంలో కార్మికులు ఏకగ్రీవంగా నిర్ణయించారని పేరొన్నారు. అయితే, ఆ కమిటీలో ఉండే కార్మిక నాయకులు గుర్తింపు సంఘం నుంచి ఉండాలంటే ముందుగా ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం అందరి సమక్షంలో తీసుకున్నామని స్పష్టంచేశారు.
ప్రభుత్వం ఇప్పటికే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని మంత్రి పొన్నం తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించే దిశగా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కేవలం కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే ముందుగా ఎన్నికలు నిర్వహించి, ఆ సంఘం నుంచి ప్రతినిధులను విలీన కమిటీలో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహా విలీనం తర్వాత ఇబ్బందులు రావొద్దని గుర్తింపు కార్మిక సంఘాల నేతలను కమిటీలో చేర్చేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కొందరు నాయకులు ఎన్నికలు జరుగకుండా, విలీన ప్రక్రియను కూడా వివాదాస్పదం చేసేలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కార్మికులు వాస్తవాలను గుర్తించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.