హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పైసలనే ఇప్పటి వరకు పూర్తిగా చెల్లించని సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీకి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానంటున్న ఆయన అప్పటి వరకు సీఎంగా ఉంటారా? అని అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో పొన్నాల మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు తన వంద రోజుల పాలనకు రెఫరెండమని గతంలో చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ విషయాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు. అవగాహన రాహిత్యం, పరిపాలన అనుభవం లేని వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. ఆయన ఓ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాటలు ఆయన ఫ్రస్ట్రేషన్‌కు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని అడ్డంపెట్టుకుని రేవంత్ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ అమలు చేస్తామంటూ ఏ జిల్లాకు వెళ్తే అక్కడి దేవతలపై ప్రమాణం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రూ.7,700 కోట్ల రైతుబంధు ఇవ్వడానికే ఇంత సమయం పడితే వేలకోట్ల రుణమాఫీ చేయడానికి ఎంత సమయం పడుతుందోనని సందేహం వ్యక్తంచేశారు. రూ.18వేల కోట్ల అప్పు తెచ్చి కూడా రైతుబంధు ఇవ్వలేదని మండిపడ్డారు. అప్పుల గురించి మాట్లాడే రేవంత్‌రెడ్డి, దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పులు చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి వక్రీకరించి మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు ఉందని మాత్రమే కేసీఆర్ అన్నారని, గతంలో 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని కేసీఆర్ అన్నారని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తానంటే తాను వారించానని నాటి సమావేశంలో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. రేవంత్ మాత్రం ప్రతి సభలోనూ కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కూలుస్తారని చెప్పినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
జానారెడ్డి,జైపాల్‌రెడ్డి అంటే చులకనా?
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలిచ్చామని రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని పొన్నాల ధ్వజమెత్తారు. గ్యారెంటీల అమలు గురించి మాట్లాడని సీఎం.. జానారెడ్డి, జైపాల్‌రెడ్డి వంటి అనుభవజ్ఞులను చులకన చేస్తున్నారని మండిపడ్డారు. జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ అని, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం జానారెడ్డి సొంతమని పేర్కొన్నారు. ఎండిన పంటలు, పంటనష్టంపై రేవంత్ ఎప్పుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిజాలు దాస్తున్నదని, రేవంత్ గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉన్నదని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల ఆయన విగ్రహానికి పూలమాల వేయని సీఎం, వేరేవాళ్లకు కూడా ఆ అవకాశం కల్పించలేదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేయని ఆయన జ్యోతిబాపూలే గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని పొన్నాల పేర్కొన్నారు.