హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి పాలకులు ఢిల్లీలో మకాం వేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనల్లో స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎకడా కనిపించటం లేదని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆరుగురు మంత్రులను డిసైడ్ చేయలేని దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ అని, మంత్రివర్గంలో ఎప్పుడూ సామాజిక సమతూకాన్ని పాటించదని మండిపడ్డారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్‌ది అని, చేర్చుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉన్న వారికి కాకుండా కొత్తవారికి ఎంపీ టికెట్లు ఇచ్చారని విమర్శించారు. మేడిగడ్డ బరాజ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసిందని, రూ.3 వేల కోట్ల మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కొట్టుకపోయిందన్న స్థాయిలో ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల మీద మాట మర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించి ఇంతవరకు జీవో ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉన్నదని అన్నారు. అయోధ్య రామమందిరంలో లీకేజీలు, బీహార్‌లో ఏడు బ్రిడ్జిలు కొట్టుకపోయాయని, ఎయిర్‌పోర్టులు కూలిపోతున్నాయని, వీటిపై మాట్లాడరేం అని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ధైర్యముంటే కేసీఆర్ అమలుచేసిన పథకాలను కొనసాగిస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకవచ్చిన యువతే ఆ ప్రభుత్వాన్ని నిట్టనిలువునా కూల్చివేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ అన్నారు. నిరుద్యోగులను కాంగ్రెస్ నిండా ముంచిందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, బల్మూరి వెంకట్‌కు ఉద్యోగం వచ్చిందని ఎద్దేవా చేశారు. గ్రూప్-1లో 1:100, గ్రూప్-2లో రెండు వేల పోస్టుల పెంచటం, గ్రూప్-3లో 3 వేల పోస్టులు పెంచటం, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులను పోలీసులతో బెదిరిస్తున్నారని, ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నిరుద్యోగుల సమస్యల పరిషారం కోసం అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పో రాడుతుందని స్పష్టం చేశారు. కొందరు మేధావులకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగుల సమస్యలు పట్టడం లేదని కోదండరాం, ఆకునూరి మురళి తదితరులను ఉద్దేశించి మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి, చంద్రబాబు గురుశిష్యులేనని.. చాలాసార్లు లోలోపల మాట్లాడుకున్నారని బాల్క సుమన్ విమర్శించారు. ఇప్పుడు బహిరంగంగా భేటీ అవుతున్నారని అన్నారు. నీటి వాటా, ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ గట్టిగా నిలబడాలని సూచించారు. అయితే రేవంత్‌రెడ్డి గట్టిగా నిలబడతారన్న నమ్మకం తమకు లేదని తెలిపారు. గురుశిష్యుల భేటీ తెలంగాణ వనరుల దోపిడీ కోసమేమోనని, ఆ భేటీ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విషయాలపై మాట్లాతారన్నదని ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్వీ నాయకుడు తుంగ బాలు పాల్గొన్నారు.