మౌనం అర్ధాంగీకారమే కాదు.. కొన్నిసార్లు పూర్తి అంగీకారమూ కావొచ్చన్నది పెద్దల మాట. బడాబాబులు తమ గుట్టు బయటపడినప్పుడు తేలుకుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఉండే మౌనం ఈ కోవలోకే వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలదీ ఇదే పరిస్థితి. అసెంబ్లీలో 22ఏ సమస్యతోపాటు తమ భూ దందాలు ఎక్కడ చర్చకు వస్తాయోనని వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయించిన సంగతి తెలిసిందే. అయినా బీఆర్ఎస్ వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ పెద్దల తతంగాన్ని నేరుగా ప్రజల ముందే ఉంచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రదర్శించారు. మంత్రి పొంగులేటి నాలుగు రోజుల కిందట అసెంబ్లీలో ఏకబిగిన మూడు గంటలపాటు ప్రసంగించారు. కానీ కాంగ్రెస్ నేతల భూ స్కామ్‌లపై ‘గప్‌చుప్’గా ఉండిపోయారు. పైగా నెపాన్ని బీఆర్ఎస్పైకి నెట్టేసేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాలుగు రోజుల కిందట అసెంబ్లీలో 22ఏ సమస్యపై ఏకబిగిన మూడు గంటలపాటు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో ఆద్యంతం తడబాటే కనిపించింది. ఎక్కడ తమ భూ దందాల ప్రస్తావన వస్తుందోనన్న భయం వెంటాడినట్టు అనిపించింది. ఓవైపు తప్పు జరిగిందంటూ ప్రజల్ని క్షమాపణలు కోరారు. మరోవైపు అధికారుల తప్పిదంతోనే ఈ సమస్య తలెత్తిందంటూ అయోమయానికి గురయ్యారు. ఇంకోవైపు ఉమ్మడి రాష్ట్రంలోని నిషేధిత జాబితాను యథావిధిగా అప్లోడ్ చేశామని చెప్పారు. ధరణి జాబితానే తాము కొనసాగించామన్నారు. ఇలా పొంతనలేని వ్యాఖ్యలు చేశారు.
ఇవేకాదు, రెవెన్యూ శాఖ మంత్రిగా నిషేధిత జాబితాపై ఆయన వెల్లడించిన అంకెలు ఆయన ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారనేందుకు అద్దం పడుతున్నాయని రెవెన్యూ వర్గాలే నవ్వుకుంటున్నా యి. బీఆర్ఎస్ హయాంలో కంటే ఇప్పుడు నిషేధిత జాబితాలోని విస్తీర్ణం తగ్గిందంటూనే.. దశాబ్దాల కిందట ప్రభుత్వం వేలం వేసిన, క్రమబద్ధీకరించిన, వివిధ రూపాల్లో ఇచ్చిన భూములను సైతం అధికారులు 22ఏలో పెట్టారని సెలవిచ్చారు. దీంతో.. ‘జాబితాలో అదనంగా భూములను చేర్చితే విస్తీర్ణం పెరుగాలి గానీ ఎలా తగ్గింది?’ అని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దల భూబాగోతాలను బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో బట్టబయలు చేయడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యిందని అంటున్నారు. అందుకే వాటి ప్రస్తావన రాకుండా, 22ఏ వైఫల్యాన్ని సమర్థించుకోవడం మంత్రికి సవాల్‌గా మారిందని పేర్కొంటున్నారు. రెవెన్యూ మంత్రి అనివార్యంగా మౌనం వహించాల్సిన, బీఆర్ఎస్ బట్టబయలు చేసిన భూస్కాముల వివరాలను మచ్చుకు కొన్ని పరిశీలిస్తే..
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ గ్రామ సర్వే నంబర్ 613(పాతది 119)లోని సు మారు 374 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. దీనిని కార్పొరేట్ కంపెనీల పేరుతో కొల్లగొట్టేందుకు పొంగులేటి పన్నిన కుట్రలను బీఆర్ఎస్ పటాపంచలు చేసింది. 22ఏ జాబితాలో బాజాప్తా ప్రభుత్వ భూమిగా పొందుపరిచిన వీటి విలువ రూ.10వేల కోట్లు. మంత్రి కుమారుడి భాగస్వామ్యం ఉన్న ఇన్ఫ్రా కంపెనీలు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని ఈ భూములను చెరబట్టడాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. కానీ పొంగులేటి కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో ఉన్న సర్వే నెంబర్ 20/1, దాని అనుబంధ సబ్-డివిజన్లు కలిపి మొత్తం 8 ఎకరాల మేర విస్తరించి ఉన్న భూమి పకా ప్రభుత్వ ఆస్తి. 2020 ప్రాంతంలో ప్రైవేట్ నిర్మాణ సంస్థ ‘సాస్ ఇన్ఫ్రా’ 1.17 ఎకరాల భూమిని తాతాలికంగా బిల్డింగ్ మెటీరియల్ స్టోరేజ్ నిమిత్తం లీజుకు తీసుకున్నది. పరిమితిని దాటి 3.17 ఎకరాలను ఆక్రమించినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ ఆ భూమిని స్వాధీనం చేసుకుని భారీ జరిమానా విధించాలని తహసీల్ద్దార్ను ఆదేశించారు.
ఈ సర్వే నంబర్లోని భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో సెక్షన్ 22/ఏ కింద నిషేధిత జాబితాలోకి చేర్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుడు రహస్యంగా, ముందస్తు నోటీసులు లేకుండానే ఈ భూములను జాబితా నుంచి తొలగించారు. ఈ వివాదంపై హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగానే, ఈ ఏడాది జూన్ 15, 19, 20 తేదీల్లో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని సాస్ ఇన్ఫ్రా పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఐటీ కారిడార్‌లో ఎకరం రూ.200 కోట్లకు పైగా పలుకుతున్న చోట ఎనిమిది ఎకరాలు అంటే రూ.1,500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తిని పక్కా స్కెచ్‌తో కొల్లగొట్టారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ లం పసుమాములలోని సర్వే నెంబర్ 410లో మొత్తం 4.07 ఎకరాల భూమి ఉన్నది. ఈ రికార్డులను పరిశీలిస్తే, 1967లోనే నాటి యజమానులు లక్ష్మీనారాయణ, నారాయణ దీనిని లీలాబాయి అనే మహిళకు విక్రయించారు. ఆ తర్వాత 1985లో లీలాబాయి ఈ భూమికి సంబంధించి చెట్టిలింగం అనే వ్యక్తికి జీపీఏ చేశారు. ఆయన ఈ భూమిలో వెంచర్ చేసి 86 ప్లాట్లను సాధారణ మధ్య తరగతి ప్రజలకు అమ్మేశారు. కాలక్రమేణా వాళ్లు అక్కడ దశాబ్దాల కిందటే ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నారు.
ఈ విలువైన భూమిపై కన్నేసిన ముఖ్యమంత్రి సోదరుడు అనుముల తిరుపతిరెడ్డి, విజయ్ రామ్ అనే మరో వ్యక్తి 2008లో మొదటి పట్టాదారు లక్ష్మీనారాయణ మనువళ్లతో ఒక చెల్లని సేల్ డీడ్ రాయించుకున్నారు. దాని ఆధారంగా భూ హకులు పొందేందుకు రంగారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించారు. రికార్డులను పరిశీలించిన కోర్టు.. 2018లో ఆ పిటిషన్ కొట్టేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు నాలా కన్వర్షన్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరించారు. 2022లో అప్పటి కలెక్టర్ పాసుపుస్తకాల దరఖాస్తులను కూడా తిరసరించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మే 28, 2024న నాలా కన్వర్షన్ పూర్తి చేసి భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలోని సర్వే నంబర్ 41 అత్యంత విలువైనది. వాస్తవానికి ఈ సర్వే నంబర్లోని 252.24 ఎకరాలు ప్రభుత్వానివి. కొన్ని దశాబ్దాల కిందట ఇందులోని 47 ఎకరాల భూములను 13మంది భూమిలేని నిరుపేదలకు సాగు కోసం ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో సర్వే నంబర్లో సబ్ డివిజన్స్ వచ్చాయి. 41/1 నుంచి 41/13 వరకు అసైనీల పేర్లు వ స్తుండగా.. 41/14లోని భూమిని ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించింది. కాలక్రమేణా ఇక్కడ భూములకు డిమాండ్ భారీగా పెరుగడంతో బడా బాబులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయొద్దనే నిబంధన ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకొని, నిర్మాణాలు చేపట్టారు.
అయితే సర్వే నంబర్ 41లోని సబ్ డివిజన్స్, గతంలో వాటిని ఎవరికి అసైన్ చేశారు? అనే దానిపై 2018లో ఒక కేసుకు సంబంధించి అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇప్పటి సీసీఎల్ఏ లోకేశ్‌కుమార్ నివేదిక కూడా ఇచ్చారు. వీటిలో ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. అంతేకాదు ప్రస్తుత కలెక్టర్ నారాయణరెడ్డి సైతం నిరుడు ఈ భూములకు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకొని ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి?, వివరాలు ఏమిటనే దానిపై 18 పేజీల నివేదికను హైడ్రాకు (బి/1002/2025, తేది: 31.12.2025) పంపారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సర్వే నంబర్లోని 41/12, 41/13 సబ్ డివిజన్స్లోని సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలోని భూమి చుట్టూ బడా బాబులు కొందరు రేకుల ప్రహరీ నిర్మించి పనులు మొదలుపెట్టారు. గతంలో అటువైపు కన్నెత్తి చూసిన అధికారులు ఇప్పుడు లేరు. చివరకు సామాన్యుల మీదకు బుల్డోజర్లను తీసుకుపోయే హైడ్రా కూడా అది ప్రభుత్వ భూమి అయినా అటువైపు వెళ్లడం లేదు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మం డలం గచ్చిబౌలి గ్రామంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో సర్వే నంబర్లు 51, 52, 53(పార్ట్) పరిధిలో మొత్తం 36 ఎకరాల భూ విస్తీర్ణం ఉన్నది. ఈ భూమికి సంబంధించి అనేక ఏండ్ల నుంచి టైటిల్ వివాదం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ఈ సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. ముఖ్యంగా ఈ భూముల సర్వే, హకులకు సంబంధించిన కీలకమైన కేసు సుప్రీంకోర్టు విచారణలోనే ఉన్నది. ఇలా న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండటమే కాదు.. అసలు భూ యాజమాన్య హక్కులపైనే వివాదాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇందులో నుంచి దాదాపు 10 ఎకరాల భూమిని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని బయటపడింది. నేటి మారెట్ ధరల ప్రకారం దాని విలువ రూ.1,000 కోట్లకుపైనే.
మంత్రి పొంగులేటి 22ఏపై అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో రంగారెడ్డి జిల్లా మునగనూరు అంశాన్ని లేవనెత్తారు. ఆ భూమిని బీఆర్ఎస్ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్టు చెప్పారు. కానీ రికార్డుల్లోని వాస్తవాలను మాత్రం దాచిపెట్టారు. కాంగ్రెస్ హయాంలో ఇందులోని 12 ఎకరాలను అధికారులు దర్జాగా పట్టా భూమిగా మార్చి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. సదరు అధికారితోపాటు ప్రైవేట్ వ్యక్తి వెనుక ఉన్న అదృశ్య హస్తం బిగ్‌బ్రదర్ అనేది బహిరంగ రహస్యం. సర్వే నంబర్ 44లో 44.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో సుమారు 22 ఎకరాల వరకు అసైన్ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత పలు సంవత్సరాల్లోని పహాణీల్లో మాత్రం ఐదు సబ్ డివిజన్స్‌గా దీన్ని ప్రభుత్వ భూమిగా నమోదు చేస్తూ వచ్చారు. 2024 అంటే కాంగ్రెస్ హయాంలోనే తాసిల్దార్ రవీందర్దత్ రాత్రికి రాత్రి 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి పట్టాగా మార్చేశారు.