పదహారేండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. నిషేధం అమల్లోకి వచ్చిన కొత్తలో వాడకం తగ్గినా, మళ్లీ యథాస్థితి నెలకొందట. సైబర్ బుల్లీయింగ్, హానికరమైన అల్గారిథమ్‌ల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గత డిసెంబర్లో ఈ చట్టాన్ని తెచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు సైతం ఇదే తరహా నిబంధనలను పరిశీలిస్తున్నాయి. అధ్యయనం ప్రకారం.. ‘తొలి నెలల్లో వినియోగం క్రమంగా తగ్గినప్పటికీ, ఇప్పుడు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి యాప్‌లను పిల్లలు తిరిగి విస్తృతంగా వాడుతున్నారట.
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్ టాక్‌ను 13 నుంచి 15 ఏండ్ల వయసున్న పిల్లల్లో 25.9 శాతం మంది ఇప్పటికీ వినియోగిస్తున్నారని స్థానిక సర్వేలు స్పష్టం చేశాయి. నిషేధానికి ముందుతో పోలిస్తే ఇది కేవలం ఒక శాతం మాత్రమే తకువ. ఇక 10 నుంచి 12 ఏండ్ల వయసున్న పిల్లల వినియోగం విషయానికి వస్తే నిషేధానికి ముందుతో పోలిస్తే కేవలం 0.06 శాతం తక్కువని లెక్క తేలింది. పిల్లలు వీపీఎన్ వాడుతూ తమ లొకేషన్‌ను మార్చడం లేదా వయసును తప్పుగా నమోదు చేయడం ద్వారా ఈ యాప్‌లలోకి ప్రవేశిస్తూ ఉండవచ్చని, నిబంధనలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయకపోవడం కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు వర్తించని వాట్సాప్ వైపు పిల్లల దృష్టి మరింత మళ్లిందని నివేదిక పేరొంది.