Congress | హైదరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో/మొయినాబాద్ నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను’ అని బహిరంగంగా సవాల్ చేసిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ‘ధన రాజకీయం’ బయటపడిందా? ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని పొంగులేటి.. ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయినట్టు తెలుస్తున్నది. పొంగులేటి అనుచరులు శనివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలిస్తున్న 7.4 కోట్ల రూపాయల ‘క్యాష్ కాన్వాయ్’ని పోలీసులు అడ్డగించి, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అజీజ్‌నగర్ అప్పా జంక్షన్లో తనిఖీలు నిర్వహించారు. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక వైపు నుంచి కాన్వాయ్‌గా వస్తున్న ఆరు కార్లను ఆపి తనిఖీలు జరిపారు. ఈ తనిఖీలలో కాన్వాయ్ మధ్యలో ఉన్న టీఎస్09ఈడబ్ల్యూ 3747 నంబర్ కారులో రూ.7.4 కోట్ల నగదు బయటపడింది. దీంతో పోలీసులు కార్లతో పాటు అందులో లభించిన నగదును సీజ్‌చేసి, 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. డబ్బు ఒకే కారులో లభించిందని, మిగిలిన అయిదు కార్లు దానికి పైలట్‌గా, కాన్వాయ్‌గా వచ్చాయని తెలిపారు. ఈ కార్లు శ్రీనిధి ఇంటర్నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ కేటీ మహి నివాసం నుంచి వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
డబ్బుతో దొరికిన ఆరు కార్లు పొంగులేటి కార్యాలయం, ఆయన బంధువుల పేర్లపై రిజిస్టర్ అయినట్టు తెలుస్తున్నది. కాగా, ఉమ్మడి ఖమ్మానికి చెందిన బీఆర్ఎస్ నేతలపై కక్ష కట్టిన పొంగులేటి ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకకుండా అడ్డుకుంటానని శపథం చేశారు. కానీ సీన్ రివర్స్ అయి.. ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో పాలేరు నియోజకవర్గంలో తన ఓటమి కూడా ఖాయమని తేలిపోయింది. దీంతో డబ్బును ఆశచూపి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. అందుకే ఈ డబ్బును ఖమ్మం తరలించి ఓటర్లకు పంచేందుకు ప్రయత్నించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 9, 10 తేదీల్లో పొంగులేటికి చెందిన ఇండ్లు, ఆఫీసులు, బంధువుల ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తన డబ్బు పంపిణీపై ఐటీ అధికారుల నజర్ ఉందని తెలుసుకున్న పొంగులేటి 3 రోజుల ముందే తన అక్రమ డబ్బును, కాంగ్రెస్ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును దాచేసినట్టు తెలుస్తున్నది. ఐటీ అధికారుల సోదాల్లో తన ‘పర్సనల్ రూమ్’లో లెక్కా పత్రం లేని 3 బ్యాగుల డబ్బు లభించింది. ఆ డబ్బు తనదేనని 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఒప్పుకోని పొంగులేటి.. ఐటీ అధికారులు ఆధారాలు చూపించడంతో అంగీకరించక తప్పలేదు. పైగా ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అంటూ అధికార పార్టీపై రుద్దే ప్రయత్నం చేశారు. శనివారం దొరికిన డబ్బులో రేవంత్‌రెడ్డి టికెట్ల అమ్మకం వాటా కూడా ఉన్నట్టు సమాచారం.
ఎన్నికల అధికారుల తనిఖీల్లో శనివారం దొరికిన రూ.7.4 కోట్ల వెనుక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీప బంధువు ఆర్ రఘురామ్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. భారీ స్థాయిలో నగదు లభ్యం కావడంతో పోలీసులు వెంటనే ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆ డబ్బును తరలిస్తున్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు ప్రారంభించారు. శ్రీనిధి విద్యా సంస్థల చైర్మన్ కేటీ మహి ఇంట్లో, అతనికి చెందిన క్రికెట్ అకాడమీ, ఫుట్‌బాల్ అకాడమీ కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. డబ్బుతో పట్టుబడిన కార్లలో రాఘవ ప్రైడ్, రాఘవ ప్రాజెక్ట్స్, సౌఖ్య డెవలపర్స్‌కు చెందిన కార్లు ఉన్నాయి. ఈ కార్లు రఘురామ్‌రెడ్డికి చెందినవిగా నిర్ధారించారు. ఆదివారం ఈ డబ్బు తరలింపునకు సహకరించిన వారి గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే డ్రైవర్‌తో పాటు అందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏ ప్రాంతానికి డబ్బు తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఎవరి ప్రోద్బలంతో ఇంత పెద్దమొత్తంలో నగదు రవాణా జరుగుతున్నది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.