హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ‘ముఖం మీదికి పేపర్లు విసిరేసిండు.. మీడియా సాక్షిగా నన్ను తీవ్రంగా అవమానించాడు’ అని బీసీ సామాజికవర్గం నేత, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన దాడిని బీసీల వ్యక్తిత్వంపై జరిగిన దాడిగా చూస్తున్నారని శ్రీహరి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. ఆదివారం ఢిల్లీకి వెళ్లిన శ్రీహరి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. వాస్తవానికి ఖర్గేతో భేటీకి ముందస్తు అపాయింట్మెంట్ ఏమీలేదు.
శనివారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మీడియాకు బ్రీఫింగ్ ఇస్తున్న సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహచర మంత్రి వాకిటి శ్రీహరి పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఊహించని ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీహరి ఈ వ్యవహారాన్ని అదేరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అవమానించిన మంత్రి నుంచి కానీ, ముఖ్యమంత్రి నుంచి కానీ స్పందన రాకపోవడంతో ఆయన ఆదివారం నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
క్యాబినెట్ భేటీ అనంతరం సమావేశ వివరాలను వెల్లడించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటి మధ్యలో కూర్చోగా.. మిగిలిన ఇద్దరు ఆయనకు చెరో పక్కన కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ సీమ్‌లో తెలంగాణ రాష్ట్రం కూడా చేరిన విషయాన్ని మంత్రి పొంగులేటి ప్రస్తావిస్తూ.. ఈ అంశం మీద రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చను మీడియాకు వివరిస్తుండగా.. పకనే ఉన్న మంత్రి శ్రీహరి ఆయనకు ఏవో పేపర్లు అందించారు.
వాటిని పరిశీలించిన పొంగులేటి అసహనంతో ఆ పేపర్లను మళ్లీ ఆయన మీదికే విసిరేశారు. శ్రీహరి వైపు సీరియస్‌గా చూస్తూ.. ప్రెస్‌మీట్‌ను కొనసాగించారు. పొంగులేటి ధోరణిని బీసీ సంఘాలు తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో శ్రీహరి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షున్ని కలువడం ప్రాధాన్యత సంతరించుకున్నది.