Congress Govt | హైదరాబాద్, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో వివిధ పత్రికలు, టీవీ చానళ్లకు రూ.200 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వివిధ పత్రికలు, చానళ్లకు ఎంత విలువ చేసే యాడ్స్ ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగన ప్రశ్నకు సమాధానిమిచ్చారు. 16 నెలల్లో రూ.200 కోట్ల విలువ చేసే యాడ్స్ ఇచ్చినట్టు వెల్లడించారు. కానీ, ఉద్యమం కోసం పుట్టి.. ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేసి.. ఉద్యమానికి ఊపిరిలూదిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపి, సబ్బండ వర్గాల వెతలను వెలుగులోకి తెచ్చి తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచి.. ఇప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూ..
ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై కాంగ్రెస్ కక్షగట్టిందన్న విమర్శలు జర్నలిస్టు సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. వివిధ పత్రికలు, చానళ్లకు రూ.200 కోట్ల యాడ్స్ ఇచ్చామని శాసనసభ సాక్షిగా సెలవిచ్చిన సర్కారు, ‘నమస్తే తెలంగాణ’ విషయంలో ఎందుకు శీతకన్ను వేసిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం అన్ని మీడియా సంస్థలను ఒకే విధంగా చూడాలని, పక్షపాతంతో వ్యవహరిస్తూ సంస్థలో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి నష్టం కలిగే చర్యలు తీసుకోకూడదన్న వాదనలు వినిపించాయి. ఇక జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి సమాధానమిస్తూ జర్నలిస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుతో ఇరకాటంలో ఉన్నామని, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూసి జర్నలిస్టులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
10,954 జీపీవోల నియామకం పూర్తయిన తర్వాత వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, వారి సంతానానికి ఉద్యోగాలివ్వడంపై ఆలోచిస్తామని చెప్పారు. ఇక పెండింగ్‌లో ఉన్న ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వోల బదిలీలను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని, కానీ సొంత జిల్లాలకు పంపబోమని స్పష్టం చేశారు. మంచి ముహూర్తం చూసుకొని భూభారతిని అమలు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తొలుత ఖర్చయ్యే రూ. లక్ష కూడా భరించలేని పేదవారికి మహిళా సంఘాలతో లింకు చేసి వారి నుంచి ఆ మొత్తం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు ఇందిరమ్మ నిధులు ఇచ్చి లబ్ధిదారులనే పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.