హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ విభాగంలో తెచ్చిన సంస్కరణలు పక్కదారి పడుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవోలు తమ అధికారాలను ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సమీక్షలో భాగంగా గురువారం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఇన్‌చార్జ్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణపు పనులు ఏ స్థాయిలో ఉన్నా ఈనెల 20లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లక్షకుపైగా జనాభా ఉన్న మండలాల్లో అదనంగా మరో తహసీల్దార్‌ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కలెక్టర్లే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అక్రమాలకు తావివ్వొద్దని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు సేకరించిన భూముల్లోనే పట్టాలిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ) : డిండి ఎత్తిపోతల పథకం ఆఫ్ టెక్ పాయింట్‌కు సంబంధించిన లెవల్ ఫిక్సేషన్‌ను తక్షణమే పూర్తి చేయడంతోపాటు, ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ కాలువల సామర్థ్యాన్ని విస్తరించాలని సూచించారు.
డిండి లిఫ్ట్‌తోపాటు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి గురువారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు. పోతిరెడ్డిపల్లిలో బరాజ్ నిర్మాణ పనులకు మే15 నాటికి ఆర్థిక సంబంధిత అనుమతులు తీసుకుని ప్రారంభించాలని ఆదేశించారు. డిండి రిజర్వాయర్‌కు సంబంధించిన నల్లగొండ పునరావాస, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అటవీ భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి స్పిల్ వేలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని, గేట్ల ఏర్పాటుకు వెంటనే టెండర్లు పిలువాలని అధికారులను ఆదేశించారు.