రంగారెడ్డి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంటే.. గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులు.. ఇప్పుడు శాసనసభా సాక్షిగా విషం కక్కుతూ టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లిలో సమీకృత భూభారతి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమనగల్లు మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేశామని, ప్రతి సర్వే నంబర్‌కూ భూ ఆధార్, సాదాబైనామాలకు పరిష్కారం చూపుతామని మంత్రి పేర్కొన్నారు.