Minister Ponguleti | ఢిల్లీ, సెప్టెంబర్ 28: పొంగులేటి ఇండ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులకు సంబంధించి కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. మొత్తం 12 వాచీలు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించిందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కటి రూ.7 కోట్లు చొప్పున వీటి విలువ రూ.84 కోట్లు. ఈ డబ్బు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖాతా నుంచి విజయవాడలోని ఓ వ్యక్తికి బదిలీ చేశారని, అక్కడి నుంచి ఒక హవాలా వ్యాపారి ద్వారా విదేశాలకు చేరాయని ఈడీ గుర్తించినట్టు పేర్కొన్నాయి. ముఖ్యనేత సింగపూర్‌కు వెళ్లినప్పుడు స్వయంగా విమానాశ్రయంలో 12 వాచీలను తీసుకొని తిరిగి వచ్చారని తేలినట్టు వెల్లడించాయి. అయితే ఆ వాచీలను ఎవరికి ఇచ్చారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఒక వాచీని రాష్ట్రంలో మీడియా హౌస్ ఓనర్‌గా మారిన ఒక జర్నలిస్టుకు ఆఫర్ చేయగా తిరస్కరించారని, దీంతో ఇతరులకు పంపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పన్ను ఎగవేత ద్వారా, హవాలా మార్గంలో తరలించిన డబ్బుతో వాచీలు తేవడం పెద్ద నేరమని చెప్తున్నారు. దీంతో వాటిని ఎవరెవరు తీసుకున్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ నుంచి డబ్బులు బదిలీ చేయడం, హవాలాకు మళ్లించడం వంటివన్నీ ఓ ఆడిటర్ పర్యవేక్షణలో జరిగాయని, అందుకే ఆయనను ఈడీ అధికారులు పిలిపించి, చాలాసేపు ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. వాచీలు ఎలా వచ్చాయి? ఎవరికి ఇచ్చారు అనే సమాచారాన్ని ఆ ఆడిటర్ ఈడీ అధికారులకు ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వాచీలు అందుకున్న ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్తున్నారు.