వరంగల్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడారం కేంద్రంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నట్టే కనిపిస్తున్నది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నట్టుగా ఇది కుటుంబసభ్యుల మధ్య వ్యవహారంలా కాకుండా మంత్రుల మధ్య ‘వర్గపోరు’గా పతాకస్థాయికి చేరిందని సోమవారం నాటి పరిణామాలను రాజకీయ పరిశీలకులు ఉదహరిస్తున్నారు. వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారంలో పర్యటించారు. మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్షించారు. అయితే దేవాదాయశాఖ పరిధిలో చేపట్టే ఈ పనుల కోసం ఏర్పాటుచేసిన సమీక్షకు సంబంధిత మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఆమెతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులెవ్వరూ పొంగులేటి నిర్వహించిన సమీక్షకు హాజరుకాలేదు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఈ సమీక్షలో పాల్గొన్నా.. గతంలో కన్నా భిన్నంగా వ్యవహరించారు. పొంగులేటితోపాటు తల్లుల (సమ్మక్క-సారలమ్మ) దర్శనం అనంతరం రెండు వేర్వేరు అభివృద్ధి పనులపై వేర్వేరు సమీక్షలు జరిగాయి. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. రెండు సమీక్షల్లోనూ పొంగులేటి మా త్రమే అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంలో మంత్రి సీతక్క ‘భక్తుల తాకిడి ఇప్పటినుంచే పెరిగింది కాబట్టి.. బయటి నుంచి రావల్సిన సామగ్రి అంతా ముందే తెప్పించుకోవాలి’ అని ఒకే ఒక్కమాట మాట్లాడారని సమాచారం.
మేడారం పర్యటన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కొండా సురేఖతో మాట్లాడేందుకు ప్రయత్నించారని, అయితే ఆమె ఆయనతో మాట్లాడేందుకు నిరాకరించారని సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి తమశాఖల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఇద్దరు మహిళా మంత్రులు పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేయడం, ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై సీరియస్ అయ్యారనే వార్త ఆదివారం దావానలమైంది. దీంతో మంత్రి కొండా సురేఖ తమకెవరూ ఫోన్ చేయలేదని, తమది పార్టీలైనేనని స్పష్టత ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి పొంగులేటి గతంలో ఎన్నడూలేనిది సోమవారం మేడారంలో ఇద్దరు మహిళా మంత్రులను ‘సమ్మక సారలమ్మ’లతో పోల్చడం చర్చనీయాంశమైంది. మహిళా మంత్రుల ఫిర్యాదుల నేపథ్యంలో గాంధీభవన్ పెద్దలు పొంగులేటిని మందలించారా? అందులో భాగంగానే ఆయన మంత్రులను ‘సమ్మక్క-సారలమ్మ’లుగా సంబోధించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం రూ.251కోట్ల ఖర్చు చేయనున్నట్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా కు తెలిపారు. మేడారం జాతర పునరుద్ధరణ పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం నిర్ణయిస్తే తాము అందులో 10 రోజులు తగ్గించి 90 రోజుల్లోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మంత్రులు ఫిర్యాదు చేశారనే అంశంపైనా ఆయన స్పందించారు. ‘నేనేంటో అందరికీ తెలుసు, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ వర్కు తాపత్రయపడే అవసరం నాకు లేదు. నాపై ఫిర్యాదు చేయడానికి ఏముంది ? ఈ సమావేశానికి సహచర మంత్రివర్యులు కొండా సురేఖ రాకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలేవీ లేవు. వచ్చే పర్యటనలో అందరూ ఉంటారని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.