హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): ‘భూకబ్జాలు చేయాలంటే నేనే చేయాలి. ఇక్కడ నాకే దిక్కు లేదు.. ఇగ పొంగులేటికి ఎక్కడిది’ అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఇంచు భూమి కూడా ముట్టలేదని క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నానంటూ భూకబ్జా ఆరోపణలను ఆయన సమర్థించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. రెడ్ల మద్దతుతోనే మహేశ్‌కుమార్‌గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని వ్యాఖ్యానించారు. డబ్బులు లేకుండా రాజకీయం లేదని, ఎవరు డబ్బు పెడితే వాళ్లు నాయకుడు అవుతాడని.. ఎమ్మెల్యేగా గెలువాలంటే రూ.100 కోట్లు అవుతున్నాయని చెప్పుకొచ్చారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే రాజగోపాల్‌రెడ్డిని కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా తనను నియమించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్‌గా జగ్గారెడ్డి అని వెంకట్‌రెడ్డి యథాలాపంగా అన్నారని, అది కూడా మూడేండ్లకో, నాలుగేండ్లకో అని చెప్పారని వివరణ ఇచ్చారు. దీనిపై కొందరు బీసీ నాయకులు స్పందించి మహేశ్‌కుమార్ గౌడ్ కూడా కొనసాగుతారని చెప్పినట్టు గుర్తుచేశారు. అందరం స్నేహితులుగా ఉన్నామని దానిని చెడగొట్టవద్దని కోరారు. కేంద్ర మంత్రి బం డి సంజయ్ మాటలకు విలువ లేదని విమర్శించారు. సోషల్ మీడియానూ బ్యాన్ చేయాలంటూ అసహనం వెళ్లగక్కారు.