హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికకు మంగళవారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 407 పోలింగ్ స్టేషన్లు, 139 ఉప పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఐదు మాడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సున్నితమైన 68 పోలింగ్ స్టేషన్ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు గస్తీ కాస్తాయని, 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తామని వివరించారు. తొలిసారిగా డ్రోన్ల సాయంతో పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రతను పర్యవేక్షించనున్నట్టు వెల్లడించారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1950 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.