హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): చేసిన వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజల పక్షాన పోరాడుతున్న తమను వేధిస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక అలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. గృహ ప్రవేశం దావత్‌ను రేవ్ పార్టీగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ధైర్యముంటే శాసనసభ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. చావుకు తెగించి వచ్చినవాళ్లం.. వెనక్కు తగ్గం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెండాడుతూనే ఉంటాం అని స్పష్టంచేశారు.
ఆదివారం జన్వాడలో తన బావమరిది రాజ్ పాకాల ఇంటిపై పోలీసులు నిర్వహించిన సోదాలపై కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. గత పదకొండు నెలలుగా తెలంగాణలో నెలకొని ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి వరుస వైఫల్యాలు, నూరు రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారంటీలు కావచ్చు, మూసీ కుంభకోణం కావచ్చు, రేవంత్ బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్లు కావచ్చు, వారు చేస్తున్న వివిధ సివిల్ సైప్లె స్కామ్ కానీ, వరుసగా జరుగుతున్న వైఫల్యాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాం. ఎక్కడా భయపడకుండా, జంకకుండా, రాజీలేకుండా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అన్నింటినీ తట్టుకుంటూ మా నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ నేర్పిన ఉద్యమబాటలో నడుస్తూ వచ్చాం. రాజకీయంగా సమాధానం చెప్పే సమర్థ్ధత లేదు. మేము లేవనెత్తే ప్రశ్నలకు విరవణాత్మకంగా, ప్రజలను సంతృప్తి పరిచే విధంగా సమాధానం చెప్పే పరిస్థితి అంతకంటే లేదు. అందుకే మమ్మల్ని ఎదురోలేక ఇవాళ మా కుటుంబ సభ్యుల మీద, మా బంధువుల మీద కేసులు బనాయించి మా మానసిక ైస్థెర్యాన్ని దెబ్బతీయాలని, ఆత్మసె్థైర్యాన్ని దెబ్బ తీయాలనే కుట్రతో, మా గొంతు నొకాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లున్నది. నేను కాంగ్రెస్ నాయకత్వానికి.. అది రేవంత్‌రెడ్డి కావచ్చు, రాహుల్‌గాంధీ కావచ్చు.. వారికి చెప్పేదొకటే, మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్లం. మీరు పెట్టే కేసులకు, మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకు భయపడేవాళ్లం అంతకంటే కాదు. ప్రాణాలకు తెగించి కొట్లాడుతాం. తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చినరోజే చావుకు తెగించి వచ్చాం అని కేటీఆర్ చెప్పారు.
నిన్నటి నుంచి ఈ రోజు వరకు, దాదాపు 22గంటలపాటు ఒక ప్రహసనంలా తనిఖీలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా.. తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో కలిసి దావత్ చేసుకోవడం తప్పా? దసరాకు, దీపావళికి ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట, దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలని అడుగుతున్నారు. రాజ్ పాకాల పది పదిహేను రోజుల క్రితం జన్వాడలోని రిజర్వు కాలనీలో ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్లాడు. వాస్తవానికి అది ఫామ్‌హౌస్ కాదు. రాజ్ పాకాల ఉండే ఇల్లు. ఆయన గృహప్రవేశం చేశాడు కాబట్టి బంధుమిత్రులను పిలిచారు. అది గృహప్రవేశం దావత్. దసరా, దీపావళి సందర్భంగా చేసుకున్న ఫ్యామిలీ ఫంక్షన్ అది. కానీ కొందరు దాన్ని సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అని పేర్కొంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అందులో 70సంవత్సరాల వయసున్న మా అత్తగారు సహా రెండు, నాలుగు, ఏడేళ్ల వయసున్న చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భోజనం చేస్తుంటే, అందులో మద్యం కూడా ఉండొచ్చు. బంధుమిత్రుల ఫంక్షన్‌ను రేవ్ పార్టీ అని పైశాచిక ఆనందం పొందుతున్నారు. పురుషులు, మహిళలు ఉన్నట్టు సోషల్ మీడియాలో చెబుతున్నారు. వారు పురుషులు, మహిళలు కాదు.. వాళ్లు భార్యా భర్తలు, కుటుంబ సభ్యులు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా, ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీ అనడం ఏమిటి? కుటుంబ సభ్యుల ఫంక్షన్‌ను భూతద్దంలో పెట్టి అధికారంలో ఉన్న కొందరు ప్రజల్లో అనుమానాలు తలెత్తేలా వ్యవహరిస్తున్నారు. 22గంటలు శోధించి, పరిశోధించి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా చేశారు. సోదాల్లో డ్రగ్స్ దొరకలేదని సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ అధికారులే స్టేట్మెంట్ ఇచ్చారు. స్నిఫర్ డాగ్స్‌తో కూడా శోధించారు. ఏమీ దొరకలేదు. యూరిన్ టెస్ట్ చేసినా ఏమీ దొరకలేదు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడబలుక్కొని దూషిస్తున్న నా బావమరిదికి కూడా నెగెటివ్ వచ్చింది. అయినా పురుషులు, మహిళలు అని, డ్రగ్స్ అని, రేవ్ పార్టీ అని అసత్య ప్రచారం చేయడం దుర్మార్గం. 13మందికి నెగెటివ్ వస్తే ఒక్కరికి మాత్రం పాజిటివ్ వచ్చింది. ఆయన డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడో తెలియదు. దాన్ని దర్యాప్తు చేయాల్సింది పోయి రకరకాలుగా అసత్య ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రం ఆలోచించాలి. అని కేటీఆర్ సూచించారు.
నేను జన్వాడలో మా బావమరిది ఇంట్లో ఉండి ఐదు నిముషాల ముందే అక్కడి నుంచి వెళ్లినట్టు కొందరు చెబుతున్నారు. నేను నిన్న సాయంత్రం ఏడున్నర, ఎనిమిది గంటలవరకు కేసీఆర్‌తో ఎర్రవల్లిలో ఉన్నాను. అక్కడి నుంచి ఇంటికొచ్చి, భోజనం చేసి, గంటసేపు టీవీ చూసి పడుకున్నా. తెల్లారేసరికి ఈ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇష్టమొచ్చినట్టు ఇటువంటి వార్తలు వేయవచ్చా. నన్ను, నా భార్యను ఇష్టమొచ్చినట్లు మీడియా అనొచ్చా. మేము పబ్లిక్ లైఫ్‌లో ఉన్నామంటే మేము పబ్లిక్ ప్రాపర్టీనా. ఏదైనా అనొచ్చా. రాజ్ పాకాల చేసిన తప్పేంటి. ఆయన ఇంట్లో ఆయన తల్లిని, తమ్ముళ్లను పిలుచుకొని కొత్తింట్లోకి పోయినందుకు దావత్ చేసుకున్నాడు. దానికి రేవ్ పార్టీ అని, దానికో పెద్ద సినిమా చేసి దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. పోలీసులు పోలీసులను కొడుతున్నారు రోడ్లమీద. అది కనపడడంలేదా. 39మంది సస్పెండ్ అయ్యారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మేము వెనక్కు తగ్గం. తప్పకుండా పోరాటం కొనసాగిస్తాం. జైలుకు పంపినా, ఇంకా ఎక్కడికి పంపినా ముమ్మాటికీ కేసీఆర్ నేర్పిన ఉద్యమ బాటలోనే నడుస్తాం. ప్రజల పక్షాన పోరాడుతాం. పరిపాలనా వైఫల్యాలను, అసమర్థ్ధతను, అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. వెనక్కు తగ్గం. అని కేటీఆర్ స్పష్టంచేశారు.
మద్యం నాలుగు లీటర్లు ఉండాల్సిన చోట ఎడెనిమిది బాటిళ్లు ఎక్కువ దొరికినాయి.. ఆ కేసు పెడుతున్నాం అని ఎక్సైజ్ అధికారులు అన్నారు. ఉదయం అది ఎక్సైజ్ కేసు అయితే సాయంత్రానికి మొత్తం మారిపోయింది. ఎన్డీపీఎస్ కేసు అని.. 25, 27,29 సెక్షన్లు పెట్టారు. ఇవి సప్లయర్, కంజమ్షన్, కోహోస్ట్కు సంబంధించిన సెక్షన్లు. సప్లయర్ అంటే డ్రగ్స్ ఎవరైనా సేవించి అయినా ఉండాలి, లేక సరఫరా చేసి ఉండాలి. అసలు అక్కడ డ్రగ్స్ దొరకనప్పుడు, డ్రగ్స్ లేనప్పుడు ఈ సెక్షన్ ఎలా పెడతారు? పైనుంచి ఆదేశాలు వస్తే కేసు మారిపోతుందా ? కంజమ్షన్ అన్నారు… అక్కడ 14మందికి టెస్ట్ చేస్తే 13మందికి నెగెటివ్ వచ్చి ఒక్కరికి పాజిటివ్ వస్తే అది దర్యాప్తు చేయాల్సింది పోయి ఒక్క మిల్లీగ్రామ్ కూడా మత్తు పదార్థం దొరక్కపోయినా ఎలా బదనాం చేస్తారు? కోహోస్ట్.. అసలు హోస్టింగే లేనప్పుడు కోహోస్ట్ ఎక్కడిది? మమ్మల్ని, మా పార్టీని ఎదుర్కోలేక, మా గొంతు నొక్కడానికి చేతుల్లో అధికారం ఉందికదా.. ఇష్టమొచ్చినట్లు వాడతాం అని రేవంత్ రెడ్డి అనుకుంటే ఆయనకు ఒక్కటే చెబుతున్నా. చావుకు తెగించి వచ్చినవాళ్లం. వెనక్కు తగ్గం.. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతాం. బాంబులు గీంబులు అంటే ఎదో చేస్తారనుకున్నాం. ఇప్పుడు చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది వీళ్ల కథ. చేతనైతే రాజకీయంగా తలపడండి, శాసనసభ సమావేశాలు పెట్టండి. రుణమాఫీ, మూసీ సుందరీకరణ, ఆరు గ్యారంటీల అమలు, సావధానంగా చర్చించి కేసీఆర్ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గొంతునొక్కి, కుటుంబ సభ్యులను వేధించి ఎదో సాధిస్తామనుకుంటే మీరు సాధించేది ఏమీ ఉండదు. తేల్చిచెప్పారు.
తాను చెప్పని మాటలను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి ఆవేదన వ్యక్తంచేశారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆదివారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ ‘నా మిత్రుడు రాజ్ పాకాల మమ్మల్ని కుటుంబ సమేతంగా దీపావళి పండుగ కోసం ఆహ్వానించారు. అక్కడ ఎలాంటి ఇల్లీగల్ అక్టివిటీస్ జరగలేదు. కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం.. మేం ఎటువంటి తప్పూ చేయలేదు. కొద్ది రోజుల క్రితమే మేము ప్రపంచ పర్యటన చేసుకొని ఇండియాకు వచ్చాం. వాటి ఆధారాలను కూడా పోలీసులకు చూపించాం. అయినా వాళ్లు ఎఫ్ఐఆర్లో నేను చెప్పని మాటలు కూడా చెప్పినట్టుగా రాస్తున్నారు. నేను అమెరికన్ సిటిజన్‌ను. 30 ఏండ్లకు పైగా సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం ఉన్నవాడిని. తప్పుడు ప్రచారంతో నా ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు. నిజాలు తప్పకుండా బయటకు వస్తయ్’ అంటూ వివరించారు.