జగిత్యాల, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అత్యంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని జగిత్యాల సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాల ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని తెలిసినా డైవర్షన్ రోడ్డు వేయకుండా మూసివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభను లక్షలాది మందితో విజయవంతంచేసి తీరుతామని స్పష్టంచేశారు. జగిత్యాల శివారులో 63వ జాతీయ రహదారిని తవ్వి వంతెన నిర్మాణ పనులు చేపట్టిన స్థలా న్ని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ భారీ బహిరంగ సభను అడ్డుకోవడానికే ఆర్మూర్, బాలొం డ, కోరుట్ల, మెట్పల్లి వైపు నుంచి ప్రజలు కుట్రపూరితంగా ప్రధాన రహదారిని తవ్వారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బం దులు పెడుతున్న ఎమ్మెల్యేకు భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వ్యవహారంపై ఆర్అండ్ బీ శాఖ మోర్తాడ్ ఎస్ఈతో మాజీ మంత్రి ఫోన్లో మాట్లాడారు. వెంటనే డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు.