హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 22 నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్లను విద్యానగర్లోని వేదిక కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. దివ్యాంగులందరికీ స్వయం ఉపాధి కింద రూ.10 లక్షలు ఇవ్వాలని, బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి దివ్యాంగులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక నాయకులు శివరాత్ర రాజయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.