Seemantonnayan | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముంబైలో సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుంది ఈ భామ. ఫిబ్రవరి 8, 2026న ముంబైలోని అనిల్ కపూర్ నివాసంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో సోనమ్ లెమన్ గ్రీన్ కలర్ లెహంగాలో మెరిసిపోయారు. ఈ కార్యక్రమంలో కరీనా కపూర్ ఖాన్, భూమి పెడ్నేకర్, షబానా అజ్మీ, అనుపమ్ ఖేర్ వంటి సినీ ప్రముఖులు సందడి చేశారు. అయితే ఈ సీమంతం గురించి ఆసక్తికర విషయాలను చెబుతూ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది సోనమ్ కపూర్.
‘సనాతన ధర్మంలోని పదహారు పవిత్ర సంస్కారాలలో (సీమంతోన్నయనం) Seemantonnayan వేడుక మూడవది. దీనిని సాధారణంగా ‘జుట్టు పాపిడి తీసే వేడుక’ అని పిలుస్తారు. ఇది కాబోయే తల్లిని, ఆమె గర్భంలో పెరుగుతున్న జీవాన్ని గౌరవించే అద్భుతమైన క్రతువు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని గోద్ భరాయ్, శ్రీమంత్, దోహాలే జేవన్, షాద్, సీమంతం, వలైకాప్పు, సీమంత, పులిక్కుడి మరియు సధభక్షణ్ వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. పేర్లు మారవచ్చు కానీ, ఆశీర్వాదం మాత్రం ఒక్కటే. అది ప్రేమ, రక్షణ మరియు కొత్త ప్రాణానికి లభించే వేడుక.
ఈ పురాతన ఆచారం నాకెంతో అర్థవంతంగా అనిపించింది, ఎందుకంటే నా ప్రాణ స్నేహితులందరూ నా కోసం ఇక్కడికి వచ్చారు. నా కుటుంబ సభ్యులందరూ కూడా తోడుగా నిలిచారు. అందరూ కలిసి నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నట్లు అనిపించింది. ఈ వేడుకను ఎంతో అద్భుతంగా నిర్వహించి, నేను ఎంతో ప్రేమించబడుతున్నాను అనే అనుభూతిని కలిగించిన మా అమ్మకు, అత్తగారికి మరియు నా సోదరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను’. అంటూ సోనమ్ రాసుకోచ్చింది.