హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఐపీఎస్ బదిలీల్లో రాజకీయ జోక్యం పెరుగుతున్నదా? వరంగల్ కమిషనర్గా ఎవరు వచ్చినా.. ఏడాదిన్నర లోపే మరో స్థానానికి బదిలీ కావాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. రాష్ట్రంలో సోమవారం 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా ఈ బదిలీల్లో సైతం రాజకీయ కోణమే ఎక్కువగా ఉందని అంటున్నారు. సూర్యాపేట ఎస్పీగా ఉన్న సన్ప్రీత్సింగ్ను 2025 మార్చిలో వరంగల్ సీపీగా పంపారు. అప్పటికే అక్కడ సీపీగా ఉన్న అంబర్కిషోర్ ఝా రామగుండం బదిలీ అయ్యారు.
ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. తన మార్క్ పోలీసు పాలన అందిస్తూ.. వరంగల్ సీపీగా ఉన్న సన్ప్రీత్సింగ్ను ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియమించారు. అలాగే 2025 ఐపీఎస్ బదిలీల్లో సంగారెడ్డి ఎస్పీగా ఉన్న చెన్నూరి రూపేశ్ను నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా నియమించారు. ఆ తర్వాత 2026లో హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ (ఎస్ఎం అండ్ ఐటీ)గా నియమించారు. ఆ తర్వాత ఇప్పుడు సీఐడీ ఎస్పీగా బదిలీచేశారు. ఒక్కొక్కరికి ఒక్కో శాఖపై పూర్తిస్థాయిలో అవగాహన రాకుండానే ఐపీఎస్ల బదిలీలు జరుగుతుండటం పోలీసుశాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.