Social Media | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ప్రజాక్షేత్రంలో ఉన్నవారిపై రాజకీయ విమర్శలు సబ బే.. అవసరమైతే విధానాలను ఎండగట్టడ మూ సమంజసమే. కానీ, వ్యక్తిగత దూషణ లు.. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను సైతం ఈ రొంపిలోకి లాగి ఇష్టానుసారంగా నీచ ప్రచారానికి దిగడం దుర్మార్గం. మరి.. తెలంగాణ సమాజంలో ఈ ‘సోషల్’ పైత్యాన్ని నింపిందెవరు? అసలు ఎప్పటినుంచి, ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఈ విష క్రీడ మొదలైంది? తెల్లారింది మొదలు బూతుపురాణమే ప్రాతిపదికగా ఉద్యమ నేత అందునా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పెద్ద మనిషిని నోటికొచ్చినట్టు దూషించిన వారెవరు? వారికి ఒత్తాసు పలికి.. వారి భాషకు తందానా అంటూ దరువేసిందెవరు? పదేండ్ల పాటు సాగిన ఈ వికృత ప్రచా రం ఇప్పుడు వెర్రితలలు వేస్తుండటంతో దాని పై చిందులేస్తున్నదెవరు? నిజమే.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ అన్నట్టు సోషల్ మీడియాలో ఇలాంటి పోకడలను అరికట్టేందుకు అవసరమైతే చట్టాలను తీసుకురావాలి.
కానీ, అంతకుముందు తెలంగాణ సమాజానికి దీని ని అలవాటుగా మార్చిన పరిణామక్రమంపైనా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లోనే ఈ పైత్యం మొదలుకాలేదు. చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించడమే కాకుం డా అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే ముందుంజలో ఉంచిన ఉద్యమ నేత, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నపుడు సైతం ఈ విశృంఖలత్వం కొనసాగింది. ఇప్పుడు దీనిపై చిందులేస్తున్నవారే నాడు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సాగుతున్న విష ప్రచారంపై వికటాట్టహాసం చేసిన సందర్భాలున్నాయి. ఒక దశలో తన నోటితోనే బాడీ షేమింగ్‌కు దిగిన దాఖలాలూ కండ్లముందే కదలాడుతున్నాయి. నియంత్రణ కొరడా ఎంత అవసరమో! ఆ దుస్సాంప్రదాయాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఘనులెవరనేది కూడా తెలంగాణ సమాజానికి ఖుల్లం ఖుల్లా తెలియాలి.
యూట్యూబర్లపై సీఎం రేవంత్ శనివారం అసెంబ్లీ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం తన ఆవేదనలో భాగంగా ఒక గొప్ప మాట అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నంత మాత్రాన తమపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? కుటుంబ సభ్యులను సైతం లాగి ప్ర చారం చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, వాస్తవానికి తెలంగాణ సమాజంలో ఈ పోకడ మొదలైంది ఇప్పుడు కాదు. ఆరేడేండ్లుగా నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలో భాగంగా మొదలైన నీచ సంస్కృతి పరాకాష్ఠకు చేరుకొని ఉద్యమ నేత కుటుంబమే లక్ష్యంగా ముందుకుసాగింది. తెల్లవారగానే విశ్లేషణల పేరిట ఒక వ్యక్తి తన సామాజిక మాధ్యమంలో నోటికొచ్చినట్టు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తుంటే తెలంగాణ సమాజమే నివ్వెరపోయింది.
కానీ, ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ అప్పుడు ప్రతిపక్ష పార్టీ పెద్దగా సదరు వ్యక్తి ని వెన్నుతట్టి ప్రోత్సహించడం తెలంగాణ సమాజం యాదిలో ఇంకా ఉంది. చట్టం తన పని తాను చేసినప్పుడు దానిని ఖండించడమే కాకుండా సదరు వ్యక్తి ఇంటికిపోయి పరామర్శించడం, చిరు మందహాసాలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు పంచుకున్న వైనం కూడా అందరికీ తెలిసిందే. చివరకు బూతుపురాణ మే ప్రాతిపదికగా రెచ్చిపోయిన సదరు వ్యక్తి కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టానుసారంగా విమర్శిస్తుంటే ‘ఇది సరైన విధానం కాదు’ అని కనీసం అడ్డుచెప్పిన నోర్లు లేవు. పైగా దానినే ప్రామాణికంగా తీసుకొని సదరు వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్సీ టికెట్‌ను బహుమతిగా ఇచ్చిన వాస్తవమూ తెలంగాణ సమాజానికి తెలుసు.
సీఎం రేవంత్ శనివారం అసెంబ్లీలో తన ప్రసంగంలో కులగణన అంశాన్ని ప్రస్తావించారు. ‘ఒక ఎమ్మెల్సీ కులగణన ను తప్పుబట్టారని అంటున్నా రు… అదే ఎమ్మెల్సీ గతంలో మీ (కేసీఆర్) కుటుంబం గురించి కూడా చాలా మాట్లాడారు. ఆ రెండింటినీ పక్కపక్కన పెడదామా?’ అని ప్రశ్నించారు. అంటే సదరు ఎమ్మెల్సీ.. కేసీఆర్ కుటుంబంపై మాట్లాడిన తీరును రేవంత్ సమర్థిస్తున్నారా? వాటిని పక్కపక్కన పెట్టి బేరీజు వేద్దామంటున్నారంటే సదరు ఎమ్మెల్సీ నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైన విధానమేనని సీఎం ధ్రువీకరించినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో తనపై, తన కుటుంబంపై సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచార తీరును సీఎం ఎండగట్టారు. ఇదెక్కడి సంస్కృతి? అని గద్దించారు. ఇదే కాదు.. గతంలో ప్రతిపక్ష పార్టీ పెద్దగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి బాడీ షేమింగ్ చేసిన సందర్భం కూడా ఉంది. కేటీఆర్ తనయుడిని పట్టుకొని చిన్న పిల్లవాడు అని చూడకుండా బాడీ షేమింగ్ చేసి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చారనేది గుర్తుచేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
వాస్తవానికి ప్రజాక్షేత్రంలో ఉన్నవారిని వ్యక్తిగతంగా, అందునా వారి కుటుంబ సభ్యులను దూషించడమనేది అందరూ ఖండించాల్సిన అంశమే. ఇందులో ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే ఈ క్రమంలోనే బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నవారి నుంచి వచ్చే పదజాలం కూడా సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే అంశాన్ని గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు. ఇటీవల ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్టు చోటుచేసుకుంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా తమపై, తమ కుటుంబ సభ్యులపై పోస్టులు చేస్తే ‘బట్టలూడదీసి కొడతాం’ అని వ్యాఖ్యానించారు.
కొన్నిరోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి రవీంద్రభారతిలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర పదజాలంతో దూషించారు. స్టేచర్… స్ట్రెచ్చర్… మార్చురీ అంటూ స్పష్టంగా తనలోని అక్కసును వెళ్లగక్కారు. అదేరోజు తెలంగాణ సమాజం కూడా తీవ్రంగానే స్పందించింది. రాష్ర్టాన్ని సాధించిన పెద్ద మనిషిని పట్టుకొని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాడిన భాషపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ, శనివారం అసెంబ్లీలో సీఎం తాను అలా వ్యాఖ్యానించలేదంటూ మాట మార్చారు. అంటే రవీంద్రభారతిలో తాను చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం, సమంజసం కాదనే వాస్తవాన్ని ఆయన గుర్తించారనేది దీని ద్వారా స్పష్టమవుతుందని పలువురు అంటున్నారు. అందుకే తాను బీఆర్ఎస్ పార్టీని అన్నానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.