మహబూబాబాద్ : పిల్లల నిండు జీవితాని రెండు పోలియో చుక్కలు వేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని కురవి మండలంలో గల మంత్రి స్వగ్రామం పెద్దతండాలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు ఉన్న పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఉందన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ… క్రమం తప్పకుండా ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నేడు జిల్లాలో ఈ రోజు 73,757 మంది చిన్న పిల్లలకు, 462 కేంద్రాల ద్వారా 1848 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేస్తున్నారని చెప్పారు. ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత రాష్ట్రంగా తెలంగాణను కొనసాగించాలని మంత్రి కోరారు.
కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వనజ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్ రాజ్, జిల్లా మహిళ శిశు, సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విక్రమ్ తదితరులు ఉన్నారు.