‘ఫోన్‌ట్యాపింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరానా పడుతున్నది? ఏదైనా దాచాలని భావిస్తే తప్ప.. ఫోన్‌ట్యాపింగ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కదా. అసలు ఈ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం గురించి మీరెందుకు (ప్రభుత్వం) అంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది?’
– సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం (డిసెంబర్ 19, 2025
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఫోన్‌ట్యాపింగ్‌పై ఏర్పాటైన ప్రత్యేక సిట్ నోటీసులు జారీచేసింది. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని కోరింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి గురువారం మధ్యాహ్నం వెళ్లిన సిట్ అధికారులు.. అక్కడ 160 సీఆర్పీసీ కింద నోటీసులు అందజేశారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు టీ హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను సిట్ విచారించింది.
ఈ క్రమంలో కేసీఆర్‌కు కూడా నోటీసులివ్వడంతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసుకొని వేధిస్తున్నదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత రెండేండ్లుగా ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై విచారణను టీవీ సీరియల్లా సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల్లో తమ వైఫల్యంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రతిసారీ అటెన్షన్ డైవర్షన్‌కు దానిని వాడుకుంటున్నది. బీఆర్ఎస్కు లభిస్తున్న ప్రజాదరణను దెబ్బతీసేందుకు, నేతలపై బురదజల్లేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు అవసరమైనప్పుడల్లా ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీదికి తెస్తున్నది. ఫిర్యాదుదారు అంటూ ఎవరూలేని ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవన్నది సుస్పష్టం. ఒకదశలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం ‘ఏముంది ఈ కేసులో? విచారణ పేరుతో ఇంకెన్ని రోజులు సాగదీస్తారు?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడిందంటేనే కేసులోని డొల్లతనం వెల్లడవుతున్నదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభాకర్‌రావుతోపాటు ఈ కేసులో ఇతర నిందితులను పదుల సంఖ్యలో పలుమార్లు గంటలకొద్దీ విచారించినప్పటికీ దర్యాప్తు అధికారులు ఎటువంటి పురోగతి సాధించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెండేండ్ల దర్యాప్తులో ఏమీ కనుగొనలేని పోలీసులు తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్‌ను ఏర్పాటుచేసి బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కుంభకోణాల ప్రజలను డైవర్ట్ చేయడానికి, వాటిని వెలికి తీస్తున్న ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెట్టడానికే ఈ కేసును వాడుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాను ప్రతిపక్షంలో ఉన్న నాటినుంచి తన ఫోన్‌ట్యాపింగ్‌కు గురైందని, తన కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని పదేపదే ఆరోపించిన ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి.. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఆయన నుంచి లిఖితపూర్వకంగా గానీ, మౌఖికంగా గానీ వాంగ్మూలం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించలే దు. నాడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పిన మాటలూ.. రాజకీయ ఆరోపణలుగానే తేలిపోయా యి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు టీ ప్రభాకర్‌రావు (ఏ1), డీ ప్రణీత్‌రావు, ఎన్ భుజంగరావు, ఎం తిరుపతన్న, పీ రాధాకిషన్‌రావు, ఏ శ్రవణ్‌కుమార్ (టీవీ చానల్ యజమాని)ని పదుల సంఖ్యలో విచారించారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడం, అప్పటికే తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులు పలు వాదనల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో ప్రభుత్వ పెద్దలు ‘స్పెషల్ సిట్’ ఏర్పాటుచేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఆ సిట్ ఏర్పడిన నాటి నుంచే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తులకు నోటీసులు ఇస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ ప్రకారమే మొదట హరీశ్‌రావు, తర్వాత కేటీఆర్, సంతోష్‌కుమార్, తాజాగా కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.
ఫోన్‌ట్యాపింగ్ అనే కేసును అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఆఖరికి టీపీసీసీ చీఫ్ కూడా విచక్షణ మర్చిపోయి బీఆర్ఎస్ నేతలను టార్గెట్‌గా చేసుకొని మాట్లాడారు. ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి, గల్లీల్లోని చిల్లర బ్యాచ్ వరకూ అడ్డూ అదుపు లేకుండా వ్యాఖ్యలు చేశారు. ఆ కట్టుకథను పట్టుకొని కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ప్రయత్నించారు.

హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్ల ఫోన్లు ట్యాప్ చేయించారని అడ్డగోలు ప్రచారం చేయించారు. ఈ కేసులో వాస్తవాన్ని బయటపెట్టాలనే ఉద్దేశంతో ‘ది హిందూ’ పత్రిక ఓ కథనం రాసింది. ‘టాలీవుడ్‌కు చెందిన కొంతమంది సినీనటుల మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఇప్పటివరకు దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభించలేదు. 4వేల సీడీఆర్లలో కానీ, 600 నంబర్లలో కానీ ఒకటైనా సినిమా హీరోయిన్ ఫోన్ నంబర్ లేదు’ అని ఆ వార్తాకథనం సారాంశం.
సిట్ అధికారులు కేసీఆర్‌కు అందజేసిన నోటీసులో ఈ విధంగా పేర్కొన్నారు.. ‘పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ క్రైం నం. 243/2024; సెక్షన్లు 166, 409, 427, 201, 120(బీ) ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ; పీడీపీపీ చట్టంలోని సెక్షన్ 3, ఐటీ చట్టం 2000లోని సెక్షన్లు 65, 66, 66 (ఎఫ్)(1)(బీ)(2) 70 కింద నమోదైన కేసు ప్రస్తుతం తదుపరి విచారణలో ఉన్నదని మీకు తెలియజేయడమైనది. విచారణ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులతో మీకు సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. కాబట్టి తదుపరి విచారణ నిమిత్తం మిమ్మల్ని విచారించడం తప్పనిసరి, అవసరమని భావిస్తున్నాం.
ఈ క్రమంలో మీరు 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణాధికారి ముందు హాజరుకావాలని కోరడమైనది. అయితే, మీకు 65 ఏండ్లు పైబడినందున క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ -1973లోని సెక్షన్ 160 నిబంధనల ప్రకారం, మీరు తప్పనిసరిగా పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కోరుకుంటే, స్వచ్ఛందంగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావచ్చు. హైదరాబాద్ నగర పరిధిలో విచారణకు అనువైన మరేదైనా ఇతర స్థలాన్ని మీరు సూచించవచ్చు. మీరు సూచించిన స్థలానికి పైన పేరొన్న తేదీ, సమయానికి విచారణ బృందంతో కలిసి విచారణాధికారి వస్తారు. మీకు ఇష్టమైన స్థలాన్ని ముందుగానే విచారణాధికారికి తెలియజేయవలసిందిగా కోరడమైనది’ అంటూ సిట్ విచారణాధికారి పీ వెంకటగిరి పేర్కొన్నారు.