Congress | సూర్యాపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి : పదేండ్ల కింద రాజకీయ కక్షలు, హత్యలకు అడ్డాగా ఉన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మళ్లీ గూండాయిజం.. విధ్వంసకాండ మొదలయ్యాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మూకలు విధ్వంసానికి తెగబడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసానికి నిరసనగా తిరుమలగిరిలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శిబిరంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. రాళ్లు, గుడ్లు విసిరి దాదాపు గంటపాటు వీరంగం సృష్టించారు. ఈ దాడిలో పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. బీఆర్ఎస్ నాయకులకు చెందిన కార్లు, వాహనాల అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేసిన మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు తిరుమలగిరిలో గాదరి కిశోర్ నేతృత్వంలో ధర్నా చేపట్టగా పెద్దఎత్తున రైతులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోటీగా బీఆర్ఎస్ శిబిరం సమీపంలోనే సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా వందలాది మంది కాంగ్రెస్ మూకలు కర్రలు, రాళ్లు, కోడిగుడ్లు పట్టుకొని బీఆర్ఎస్ శిబిరం వైపు పరుగులు తీస్తూ ఏకబిగిన దాడి చేశారు. రాళ్లు, గుడ్లు రువ్వుతూ టెంట్లు కూల్చి వేశారు. కుర్చీలు ఎత్తికొడుతూ బీఆర్ఎస్ నేతల కార్లు, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో తాటిపాములకు చెందిన పెరుమాళ్ల రాజేశ్, తుంగతుర్తి మండలం బండరామారానికి చెందిన పొదిల అంజయ్య, శాలిగౌరారం మండలం వంగమర్తికి చెందిన శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. వారిని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, గాదరి కిశోర్ పరామర్శించారు. కాంగ్రెస్ మూకలు బీఆర్ఎస్ శిబిరంపైనే కాకుండా రోడ్డువెంట వెళ్తున్న ఇతర వాహనాలపైనా రాళ్లు రువ్వారు. ఓ బస్సుపైకి రాళ్లు రువ్వడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ముగ్గురు మహిళలు కాంగ్రెస్ శ్రేణులపై మండిపడ్డారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
గాయపడిన బీఆర్ఎస్ నాయకులను పరామర్శించేందుకు సూర్యాపేట నుంచి తిరుమలగిరికి వస్తున్న జగదీశ్‌రెడ్డిని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారితో మాజీ మంత్రి వాగ్వాదానికి దిగారు. గాయపడ్డవారిని పరామర్శించేందుకు వెళ్లనీయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
కాంగెస్లాగా బీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేయదని, పదేండ్ల పాలనలో ఏనాడూ ఇంత నీచంగా ప్రవర్తించలేదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ స్పష్టంచేశారు. రుణమాఫీపై మంత్రులకే స్పష్టత లేదని, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, రైతులను మోసం చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ రజాక్, బీఆర్ఎస్ నాయకుడు యుగేంధర్‌రావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ మూకల దాడికి పోలీసులూ మద్దతు పలికారు. కర్రలు, రాళ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిందిపోయి పోలీసులే స్వయంగా బీఆర్ఎస్ ధర్నా శిబిరం టెంట్‌ను కూల్చారు. వాస్తవానికి ముందుగా తిరుమలగిరి చౌరస్తా సమీపంలో బీఆర్ఎస్ శ్రేణులు టెంట్ వేసి ధర్నాకు కూర్చున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం ప్లెక్సీకి క్షీరాభిషేకం చేసేందుకు పోటీగా వస్తున్నారనే విషయం గమనించి వారిని వారించాల్సిన పోలీసులే దగ్గరుండి ఉసిగొలిపి తీసుకొచ్చారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై కాంగ్రెస్ మూకల దాడి హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమలగిరిలోని గాదరి కిశోర్ నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శిబిరంపై కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ తప్పులను, మోసాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నదని, హింసను ప్రేరేపిస్తున్నదని విమర్శించారు. పోలీసులు కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని దీక్ష శిబిరాన్ని పోలీసులే కూలగొట్టడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసం అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తిరుమలగిరి ఘటనపై విచారణ చేయాలని, రైతులకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు.