KCR | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ చావును పదేపదే కోరుకుంటుండటంపై రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా వేదిక ఏదనేది చూడకుండా ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అని పట్టించుకోకుండా సభ్యత, సంస్కారాలు మరిచి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్‌రెడ్డిని తిట్టారనే ఆరోపణలమీద అనేకమంది సామాన్యులపై, నిరుపేదలపై, దళితులపై, సోషల్ మీడియా వారియర్లపై కేసులు పెడుతున్న పోలీసులు మరి గత కొంత కాలంగా కేసీఆర్ మీద రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. పోలీసులు శాసనానికి, రాజ్యాంగానికి బద్ధులని, వారు చట్టప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
దేశంలో ప్రముఖులకు ఒక న్యాయం, మాములు వాళ్లకు మరో న్యాయం అని ఏమీ లేదని, ఒకవేళ కడుపు మండిన పేదలు రేవంత్‌రెడ్డిని తిట్టడం శిక్షార్హమైన నేరమైతే, రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను తిట్టడం కూడా నేరమే అవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. పరుష వ్యాఖ్యలు చేసిన వారిపైనే కాదు, ఆ వ్యాఖ్యలను పోస్టు చేసిన వారిపైనా పోలీసులు సుమోటోగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని, అలాంటప్పుడు వారు కేసీఆర్‌పై పరుష వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌పైనా కేసులు పెట్టాల్సి ఉంటుందని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. తెలంగాణ పోలీసులు, పోలీసు శాఖ నిజంగా, నిజాయతీగా చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటుంటే అది తనంత తానుగా రేవంత్‌రెడ్డి మీద కేసులు పెట్టి తన నిక్కచ్చితనాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు సవాలు విసరుతున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు తన కుటుంబ సభ్యులను ఎంతో బాధిస్తున్నాయని, అందుకే కేసులు పెడుతున్నామని రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారని, మరి ఇప్పుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబ సభ్యులనే కాకుండా కోట్లాదిమంది తెలంగాణ ప్రజలను బాధపెడుతున్నాయని, అలాంటప్పుడు రేవంత్‌పై పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని సీనియర్ పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు.