వనపర్తి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల దాడులు పెట్రేగిపోతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దాడులను సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. పాన్‌గల్ పోలీసులు న్యాయం చేయడం లేదని రెండు రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగి వనపర్తి దవాఖానలో చికిత్స పొందుతున్న తెల్లరాళ్లపల్లికి చెందిన బాలునాయక్‌ను బుధవారం బీరం పరామర్శించారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి గృహంలో మీడియాతో మాట్లాడారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు పాల్పడినా స్పందించడం లేదన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేసేలా ఉండాలని సూచించారు. కొల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి దాసోహమైందని విమర్శించారు. తెల్లరాళ్లపల్లిలో దాడికి గురై మూడు రోజులుగా ఎస్సైని వేడుకున్నా కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. న్యాయం కోరిన బాధితులపైనే కేసు బనాయిస్తానంటూ బెదిరించడం సరికాదని చెప్పారు. దొండాయిపల్లికి చెందిన యువకులను రోజంతా స్టేషన్లో ఉంచి వేధించారని, చిక్కెపల్లిలోనూ ఇసుక అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బాలు కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.