హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘మా భూములు మాకే కావాలి’ అని పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం కుట్ర చేస్తుందా ? స్వచ్ఛందంగా చేస్తున్న ఆందోళనలకు పార్టీల రంగు పులుముతుందా? భూములు ఎక్కడ కోల్పోతామోనని మా బిడ్డలే అధికారులపై తిరగబడ్డారని చెబుతున్నా కూడా.. ఆ దాడిని బీఆర్ఎస్కు అంటగట్టే ప్ర యత్నం చేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఫార్మా ఆందోళనలు పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వ అనుకూల మీడియా మొత్తం మంగళవారం ఉదయం నుంచే కక్షకట్టి అనుకూలమైన వార్తలను వండి వార్చుతున్నది.
అర్ధరాత్రి నుం చి తెల్లవారుజాము వరకూ వందలామంది పోలీసులు బాధిత గ్రామాలపై దండయాత్ర చేసి.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి.. ఎక్కడికక్కడే రైతులను అక్ర మ అరెస్టులు చేస్తుంటే.. ఆ వార్తలు ఎక్కడా మీడియాలో రాకుండా జాగ్రత్తపడ్డారు. దానిని కూడా డైవర్ట్ చేసేలా ‘సురేశ్‌తో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి 40 సార్లు మాట్లాడా డు.. అతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో 6 సార్లు మాట్లాడాడు’ అంటూ పోలీసులు ఇచ్చే లీకులతో మీడియా మొత్తం నానా హడావిడి చేసింది.
మీడియా డైవర్షన్ మొత్తం బీఆర్ఎస్పైనే ఉండటంతో డీజీపీ ఆదేశాల మేరకు పోలీసుశాఖ ఘటనపై రహస్యంగా విచారణ చేపట్టింది. లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ పోలీసుల నేతృత్వంలో పోలీసులు రైతుల ఆందోళనలపై నివేదిక తయారు చేసినట్టుగా తెలిసింది. ఆ నివేదికలోనూ రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని, రైతులంతా కొన్ని నెలల తరబడి ఆ ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తున్నారని, అందులో అన్ని పార్టీలకు చెందిన రైతులు ఉన్నారని వచ్చినట్టు తెలిసింది. ఆ నివేదికను సీఎస్ శాంతికుమారికి అందజేయగా ఆమె మంగళవారం సచివాలయంలో ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ, కలెక్టర్లతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. అనంతరం ఆ నివేదికపై మంత్రి శ్రీధర్‌బాబు కూడా సమీక్షించినట్టుగా తెలిసింది. మొత్తానికి ఒక్క లగిచర్ల ఆందోళనను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ అనుకూల మీడియా నానా తంటాలు పడిందని కొందరు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా మొత్తం పోలీసులు ఇచ్చే లీకులతో బ్రేకింగ్‌లు వేస్తూ.. ఎంతో ప్రధానమైన సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనకు ఆద్యులు బీఆర్ఎస్ నేతలే అంటూ ముఖ్యమంత్రి తమ్ముడి అనుకూల చానల్, మరో కాంగ్రెస్ నేతకు చెందిన చానళ్లు నాన్‌స్టాప్‌గా వార్తలు వండి వార్చారు. సీఎం తమ్ముడి చాన్లైతే.. ఒక అడుగు ముందుకేసి వారికి చెందిన యూట్యూబ్ చానల్లో ‘కేటీఆర్ నిందితుడు.. అతనే దాడులకు ఉసిగొల్పిండు’ అంటూ పెద్దపెద్ద థంబనైల్స్ పెట్టి ఆయా వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా పోస్టు చేశారు. ‘నాపై ఎలాంటి దాడి జరగలేదు’ అని స్వయంగా వికారాబాద్ కలెక్టర్ మీడియాకు చెప్పినా కూడా.. ‘కలెక్టర్‌పై దాడి’ అంటూ ప్రజా ఆందోళనను పక్కదారి పట్టించడంలో ముఖ్యమంత్రి రేవంత్, వారి అనుకూల మీడియా మంగళవారం మొత్తం నిమగ్నమైంది.