దుండిగల్, జూలై 7 : మటన్ విషయంలో భార్యతో గొడవపడిన భర్త చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వెంటనే స్పందించి కాపాడారు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాచుపల్లిలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన సాయిని నరేశ్, రాణి దంపతులు. నరేశ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాణి కూలికి వెళ్తుంది. ఆదివారం కావడంతో నరేశ్ మటన్ తీసుకొచ్చాడు.
తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండగా, మటన్ ఎందుకు తెచ్చావని రాణి భర్తతో గొడవపడింది. దీంతో మనస్తాపం చెందిన నరేశ్ అక్కడి నుంచి నేరుగా సమీపంలోని బైరుని చెరువు వద్దకు వెళ్లాడు. నడుముకు పెద్దరాయి కట్టుకుని చెరువులోకి దిగుతుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ సత్యపాల్‌రెడ్డి చెరువులోకి దిగి నరేశ్‌ను కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాణిని సైతం పీఎస్‌కు పిలిపించి దంపతులిద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు.