Big Brothers | (స్పెషల్ టాస్క్బ్యూరో) ; అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఒక ఇంటిని ఒక వ్యక్తి అద్దెకు ఇచ్చాడు. ఒకరోజు ఓ వ్యక్తి వచ్చి అద్దెకు ఉన్న ఇంటిని తన పేరిట రాయాలని అద్దెకు ఉన్న వ్యక్తితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన పక్కింటి వ్యక్తి బాధ్యతగా అసలు విషయాన్ని బయటకి చెబుతాడు. ఆధారాలతో సహా అద్దెకు ఉన్న వ్యక్తి-మరో వ్యక్తితో చేసుకున్న అక్రమ ఒప్పందాన్ని బయటపెడతాడు. దీంతో విషయం తెలుసుకున్న అసలు యజమాని పక్క ఇంటి వ్యక్తి ఇచ్చిన ఆధారాలతో అక్రమమైన ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ అద్దెకు ఉన్న వ్యక్తి మాత్రం.. పక్కింటి వ్యక్తి బయట పెట్టడం వల్ల తన ప్రయోజనాలకు విఘాతం కలిగిందని తిరిగి పక్కింటి వ్యక్తిపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు.ఆ ఒప్పందం చేసుకున్న వ్యక్తి ఎవరు? ఆ ఒప్పందానికి చట్టబద్ధత ఉందా? లేదా? అని కదా విచారణ చేయాల్సింది.
కానీ ఘనత వహించిన పోలీసులు రెండ్రోజుల్లో ఏకబిగిన విచారణ చేశారు. కానీ ఒప్పందం చేసుకున్న వారిని విస్మరించారు. అక్రమమైతే నీకేంది? నువ్వెందుకు ఫిర్యాదు చేశావంటూ పక్కింటి వ్యక్తిపైనే కేసు నమోదు చేశారు. అక్రమాలను బయటపెడితే కేసులు తప్పవంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. చివరకు అక్రమంగా ఆ ఆస్తిని కాజేయాలనుకున్న వ్యక్తి పేరు, ఆధార్ నంబర్, చిరునామా అన్నీ ఉన్నా ఆయనెవరో తెలియదంటూ ‘గుర్తు తెలియని వ్యక్తి’ అంటూ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అక్రమాలు జరుగుతాయి. దాని వెనక ఎవరు ఉన్నారో చూసుకోవాలి కదా? తెలిసినంత మాత్రాన గొంతెత్తి బయటకి చెబుతావా? అంటూ పక్కింటి వ్యక్తిని కేసు ద్వారా హెచ్చరించారు.
కార్పొరేట్ యంత్రాంగం వత్తాసు
బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్‌పై తెలంగాణ పోలీసుశాఖ తీరుకు అద్దంపట్టే ఉదాహరణ ఇది. ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచి అనేక రివార్డులు పొందిన తెలంగాణ పోలీసు శాఖ పని తీరు ఇది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సర్వే నంబర్ 92లోని సుమారు 300 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు కొన్ని శక్తులు కుట్రపన్నితే దానిని ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో సహా బయటపెట్టింది. ప్రభుత్వ భూమిని, గ్రామ అవసరాలకు ఉపయోగపడే భూములను ఒక కంపెనీకి ధారదత్తం కావడాన్ని అడ్డుకున్నది. అతుల్యం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులను మభ్యపెట్టి అనధికార ఒప్పందాలను చేసుకుంటుంటే కండ్లు మూసుకున్న అధికార యంత్రాంగం కనీసం ఆ విషయం బయటపడిన తర్వాతనైనా బాధ్యాతయుతంగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఒక వైపు మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీ కబళించేందుకు యత్నిస్తే మాత్రం దానికి వత్తాసు పలకడం సామాన్యుడిని ఆలోచింపజేస్తున్నది. ముఖ్యంగా అతుల్యం హోమ్స్ ఎవరిది? ప్రవీణ్‌రెడ్డి ఎవరు? అంటూ రెండు రోజుల పాటు విచారణ చేసిన తెలంగాణ పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ విభాగం చివరకు నాదర్గుల్ భూములపై ఒప్పందం చేసుకున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి(అన్ నోన్ పర్సన్) అంటూ కేసు నమోదు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
‘నమస్తే’పైనే కేసా?
‘కబ్జాలోకి ప్రభుత్వ భూమి.. కాపాడుకోండి’ అంటూ రేవంత్ సర్కార్‌కు ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో సహా కథనాన్ని కండ్ల ముందుంచింది. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవకుండా నమస్తే తెలంగాణ దినపత్రిక విస్తుగొలిపే విషయాలతో సంచలన కథనం ప్రచురించింది. దీనిపై విచారణ చేయకుండా ‘నమస్తే తెలంగాణ’ పైనే ఎదురుదాడికి దిగేందుకు కుట్ర పన్నారు. అందులో భాగంగా పోలీసులు ‘నమస్తే తెలంగాణ’పైనే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంపై నమస్తే తెలంగాణ ప్రతినిధి మీర్పేట్ సీఐకి ఫోన్ చేసి కేసుకు సబంధించి వివరాలు అడిగితే సదరు సీఐ నమస్తే తెలంగాణపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని స్పష్టం చేశారు. కానీ ఆ ఫిర్యాదు కాపీని సూత్రధారుల అనుకూల మీడియాకు లీక్ చేశారు. సదరు ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో విస్త్రతంగా వైరల్ చేయించారు. పబ్లిక్ డొమైన్లో ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా రహస్యంగా ఉంచడం అనుమానాలకు దారి తీస్తుంది.
సీఐతో నమస్తే సంభాషణ
నమస్తే తెలంగాణ ప్రతినిధి: సార్ సమస్తే
సీఐ: నమస్తే చెప్పండి
నమస్తే తెలంగాణ ప్రతినిధి: బాలాపూర్ తహసీల్దార్ నాదర్గుల్ రెవెన్యూ సర్వే నంబర్ 92కు సంబంధించిన విషయం పై ఏమైనా ఫిర్యాదు చేశారా సార్? ఈ విషయం గురించి రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను కదా సార్.
సీఐ: అవును నేను బీజీగా ఉన్నాను.
నమస్తే తెలంగాణ ప్రతినిధి: తహసీల్దార్ ఫిర్యాదు చేశామన్నారు.
సీఐ: నేను చూడలేదు తెలుసుకుంటాను. సదర్ మేళాలో ఉన్నాను.
నమస్తే తెంలగాణ ప్రతినిధి: ఫిర్యాదు చేయలేదన్నారు కదా ఎఫ్ఐఆర్ చేశారని తెలిసింది.
సీఐ: పై నుంచి నాకు ఒత్తిడి ఉందబ్బా.
నమస్తే తెంలగాణ ప్రతినిధి: నేను చాలా సార్లు ఫోన్ చేసినా మీరు స్పందించకుండా ఒక మీడియా(దిశ)కు ఎఫ్ఐఆర్ ఎలా బయటకు ఇచ్చారు సార్.
సీఐ: నేను ఇవ్వలేదు ఎవరు ఇచ్చారో తెలుసుకుంటాను.
నమస్తే తెలంగాణ ప్రతినిధి: మేము పదేపదే అడుగుతున్నాము కదా సార్, ఇతర మీడియా సంస్థలకు ఎలా ఇస్తారు? మాకు ఎందుకు ఇవ్వరు సార్? కేసు మాపైన అయింది కదా?
సీఐ: నాకు అందరు సమానమే.
నమస్తే తెలంగాణ ప్రతినిధి: అయితే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు.
సీఐ: హడావుడిగా ఉన్నాను. తర్వాత చెపుదామనుకున్నాను.
నమస్తే తెలంగాణ ప్రతినిధి: సార్ పక్షపాతం చూపిస్తున్నారు.
సీఐ: నేను మేజర్ పత్రికలకు ఇవ్వకుండా దిశకు ఎలా ఇస్తాను?
నమస్తే తెలంగాణ ప్రతినిధి: మీ నుంచి దిశకు సమాచారం వచ్చిందని తెలిసింది సార్
సీఐ: నేను ఇవ్వలేదు.
నమస్తే తెలంగాణ ప్రతినిధి: నమస్తే తెలంగాణ అనగానే ఎప్పుడూ ఇలానే చేస్తున్నారు సార్
సీఐ: అదేం లేదు. ఇక నుంచి అలా జరగకుండా చూస్తాను. నాకు తెలియకుండా దిశకు ఎఫ్ఐఆర్ ఎవరు ఇచ్చారో పరిశీలిస్తాను. రైతులు నమస్తే తెలంగాణ పై ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ గుర్తుతెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశారు.
నమస్తే తెలంగాణ ప్రతినిధి: ముందు ఎందుకు చెప్పలేదు సార్
సీఐ: సరే పోనివ్వండి ఇక నుంచి తప్పకుండా సమాచారం ఇస్తాను