వేములవాడ, డిసెంబర్ 3 : గురుకుల పాఠశాలల్లో పేద బిడ్డల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న తమను కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గురుకులాల తనిఖీ ఇన్చార్జి వెంగళ శ్రీకాంత్‌గౌడ్‌తో కలిసి ఆయన వేములవాడలోని బోయినపల్లి గురుకుల బాలుర పాఠశాల, కళాశాల పరిశీలనకు వెళ్లారు. వారు పాఠశాల లోపలికి వెళ్లకుండా పోలీసులు, అధికారులు గేటుకు అడ్డంగా నిలుచున్నారు. సీఐ వీరప్రసాద్, ఎస్సై రమేశ్, ఆర్ ఏఎస్‌ఐతోపాటు పదిమంది పోలీసులను పాఠశాల భవనం వద్ద బందోబస్తు నిర్వహించారు. అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు.
ఆ తర్వాత కొంతసేపటికి అధికారులు కేవలం రవిశంకర్‌తోపాటు శ్రీకాంత్‌గౌడ్‌ను అనుమతించారు. వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడంతో వారు గేటు బయట నిలిచిపోయారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ 1029 పాఠశాలలను నెలకొల్పారని, ఒ కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి నాణ్యమైన పౌష్టికాహారంతోపాటు మెరుగైన విద్యను అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోకపోవడంతో విద్యార్థుల జీవితాలు అధ్వానంగా మారినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం తిని వందలాదిమంది అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. పదుల సంఖ్యలో విద్యార్థుల మరణించడం, ఆత్మహత్యలు వంటివి జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.
పరిశీలనకు ముందే తనిఖీలు
వేములవాడలోని బోయినపల్లి గురుకుల కళాశాలను పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వసున్నట్టు సమాచారం అందుకున్న బోయినపల్లి ఎంపీడీవో జయశీల, విద్యాధికారి శ్రావణ్‌కుమార్ ముందుగానే అక్కడికి చేరుకుని గురుకుల పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. అన్నీ చూసిన తర్వాతనే బీఆర్ఎస్ నేతలను లోనికి అనుమతించారు.