వికారాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): లగచర్ల బాధితులను కలిసి పరామర్శించేందుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. మహిళా సంఘాల జేఏసీ నాయకులు, పీవోడబ్ల్యూ సంధ్య, పద్మజాషా, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్ లిల్లీ, గీతతో కూడిన నిజ నిర్ధారణ బృందం మంగళవారం లగచర్ల బాధితులను కలిసేందుకు వెళ్తుండగా బొంరాస్‌పేట మండలంలోని తుంకిమెట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కమిటీ సభ్యుల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మహిళా సంఘాల నేతల దుస్తులు చినిగిపోవడంతో పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీతోపాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో మాట్లాడినప్పటికీ వారిని లగచర్ల వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. మీడియా లేకుండా వెళ్తామని, తమతోపాటు పోలీసులకు కూడా రావొచ్చని కోరినా పోలీసులు అనుమతించకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లగచర్ల వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకోవడంపై సంధ్య మండిపడ్డారు. పరిగిలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితుల వద్దకు వెళ్తే నిజాలు బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం, పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమను లైంగికంగా వేధించారని, అసభ్య పదజాలంతో దూషించారని, తమకు అండగా నిలవాలని కోరుతూ బాధితులు ఫోన్లు చేసి కోరుతున్నారని తెలిపారు. గిరిజన మహిళలపై దౌర్జన్యాలు చేయకుంటే, లైంగిక వేధింపులకు పాల్పడకుంటే తమను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానంగానే ఉందన్నారు. లగచర్ల ఘటనపై ప్రతి ఒక్కరు స్పందించాలని పిలుపునిచ్చారు. వారికి తాము అండగా ఉంటామని పేర్కొన్నారు.
పోలీసుల తీరుతో ఆరోపణలకు బలం
లగచర్ల ఘటనకు సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు వెళ్తుండగా పోలీసులు తమను అడ్డుకోవడం దారుణమని సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిందని ఆరోపించారు. తమను నిర్బంధించి, బూతులు మాట్లాడారంటూ బాధితులు చెప్తున్నది నిజమో, కాదో తెలుసుకునేందుకు వచ్చామని, పోలీసుల తీరు చూస్తుంటే వారి ఆరోపణ నమ్మే విధంగానే ఉన్నదని తెలిపారు. పోలీసులు తన దుస్తులు చింపివేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన, జులుం, ప్రజల హక్కులను గౌరవించని తనం, ప్రజా వ్యతిరేక పాలన, కార్పొరేట్ అనుకూల పాలన సాగుతోందని విమర్శించారు. మూసీ ప్రజల ఆక్రందనలు, ఆందోళనలు పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భూములు ఇచ్చేది లేదని చెప్పే హక్కు రైతులకు లేదా? అని ప్రశ్నించారు. ప్రజల ఆక్రందన, ఆవేదనను అర్థం చేసుకునేందుకు వచ్చిన తమపైనా ప్రభుత్వం నిర్బంధం, నియంతృత్వం ప్రదర్శించిందని విమర్శించారు.
7వ గ్యారెంటీగా నిర్బంధ పాలన
ఫార్మాసిటీలు, ఇథనాల్ ఫ్యాక్టరీల దగ్గర ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని సంధ్య పేర్కొన్నారు. ప్రజల గోడు పట్టించుకోకుండా, ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసేది అభివృద్ధి కాదని విమర్శించారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు అక్కడ డీజేలు పెట్టి సంబురాలు జరుపుకొన్నారని, అలాంటి వారిపై పోలీసులు ప్రయోగిస్తున్న భాష, ప్రభుత్వ వైఖరి సరిగా లేదని పేర్కొన్నారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అని చెప్పిన రేవంత్‌రెడ్డి పాలనతో నిర్బంధం కొనసాగుతున్నదని విమర్శించారు. ఈ ప్రాంత రైతులు పోలేపల్లి సెజ్‌ను సందర్శించారని, అప్పుడు వారు చెప్పింది విని రైతులు షాకయ్యారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు ఏమూలకు రావని, కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్నాని, పిల్లలు అష్టవంకర్లతో పుడుతున్నారని, భూములు ఇచ్చి తప్పు చేశామని, మీరు కూడా భూములిచ్చి తప్పు చేయవద్దని వారితో చెప్పారని తెలిపారు. పోలీసులు తమ ఇండ్లకు వచ్చి తలుపులు పగలగొట్టి అసభ్యంగా వ్యవహరించి తమ కొడుకులు, భర్తలను అరెస్ట్ చేశారని లగచర్ల మహిళలు వాపోతున్నారని సంధ్య పేర్కొన్నారు.
భూమి ఉన్న చోటే కంపెనీ పెట్టుకోండి
సిస్టర్ లిల్లీ మాట్లాడుతూ మహిళలపై అన్యాయాలు, దాడులు జరిగినపుడు పౌరులుగా స్పందించడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలను తొక్కేసి ఇతరుల అభివృద్ధికి కృషి చేయడం అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. అక్కడి వారు కష్టంగా జీవిస్తూ, కష్టపడి ఇండ్లు కట్టుకుని, పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారని, అది వారు ఆ ప్రాంతానికి తీసుకొచ్చిన అభివృద్ధి అని పేర్కొన్నారు. భూమి ఉన్న చోటే కంపెనీలు పెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రజల మాట వినాలని, వారి కష్టాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజల భూమి హక్కులపై ప్రభుత్వం దాడి చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘాల జేఏసీ నాయకురాళ్లు పద్మజాషా, ఝూన్సీ, అనసూయ, సజయ, గీత తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఏడో గ్యారెంటీ నిర్బంధం
ఫార్మాసిటీలు, ఇథనాల్ ఫ్యాక్టరీల దగ్గర ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. ప్రజల గోడు పట్టించుకోకుండా చేసేది అభివృద్ధి కాదు. కాంగ్రెస్ గెలిచినప్పుడు అక్కడ డీజేలు పెట్టి సంబురాలు జరుపుకొన్నారు. ఇప్పుడు అలాంటి వారిపై పోలీసులు ప్రయోగిస్తున్న భాష, ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. పోలీసులు తమ ఇండ్లకు వచ్చి తలుపులు పగలగొట్టి అసభ్యంగా వ్యవహరించి తమ కొడుకులు, భర్తలను అరెస్ట్ చేశారని లగచర్ల మహిళలు వాపోతున్నారు. రేవంత్‌రెడ్డి పాలనతో నిర్బంధం ఏడో గ్యారెంటీ.
– పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య