సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు దుర్గాపురం వద్ద లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కారులోనుంచి బయటకు తీసి కోదాడ దవాఖానకు తరలించారు.
మృతులను కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.