Singur Dam | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) హెచ్చరికలతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కండ్లు తెరచింది. మంజీరా నదిపై (Manjeera River) ఉన్న సింగూర్ డ్యామ్ (Singur Dam) మరమ్మతులను చేపట్టేందుకు సిద్ధమైంది. కానీ మరమ్మతు పనులు చేపట్టేందుకు సింగూరు డ్యామ్‌ను ఏవిధంగా ఖాళీ చేయాలనే అంశంపై ఇరిగేషన్‌శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తైబందీ అవసరాలు ప్రస్తుతం అంతగా లేకపోవటం, దిగువ రిజర్వాయర్లు నిండుగా ఉండటంతో జలాలను విడుదల చేస్తే వృథా అవుతాయనే సందిగ్ధంలో పడిపోయారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. సింగూరు డ్యామ్ మరమ్మతుల విషయమై ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ నేతృత్వంలో కామారెడ్డి సీఈ శ్రీనివాస్, ఓఅండ్ఎం ఈఎన్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నిపుణులతో కూడిన బృందం ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్స్ చేసిన సిఫారసులపై చర్చించింది. వాస్తవంగా సింగూర్ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు. ఆనకట్ట వాస్తవ డిజైన్ ప్రకారం రిజర్వాయర్ స్థాయి 517.8 మీటర్లు కాగా, ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం కోసం రిజర్వాయర్ కనీస స్థాయిని 522 మీటర్లు కంటే ఎకువగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆనకట్టకు ఇరువైపులా ఏడు కిలోమీటర్ల మేర విస్తరించిన మట్టి, రాతి కట్టడం నీటిఅలల తాకిడికి 900 మీటర్ల మేరకు రివెట్మెంట్ దెబ్బతిన్నది. డ్యామ్ ఎగువ వాలుపైనున్న రివెట్మెంట్, ఎఫ్ఆర్ఎల్ భాగానికి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో మట్టి వాలు రివెట్మెంట్, ఎర్త్ డ్యామ్ పైభాగంలో పగుళ్లు తేలాయి. వాటికి సంబంధించి మరమ్మతులను రెండు దఫాలుగా చేపట్టాలని నిర్ణయించింది.
మరమ్మతు పనుల నిర్వహణకు డ్యామ్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారిగా కాకుండా క్రమానుగతంగా రోజుకు ఒక అడుగు చొప్పున నీటిని ఖాళీ చేయాలని ఇరిగేషన్‌శాఖ భావించింది. సింగూరు డ్యామ్ ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో 522 మీటర్ల లెవల్లో ఉన్నది. రిజర్వాయర్‌లో 16 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయి. 517.5 ఎఫ్ఆర్ఎల్ లెవల్ వరకు అంటే దాదాపు 8 టీఎంసీల మేరకు జలాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. దిగువన నిజాంసాగర్, ఘనపూర్ ఆనకట్ట సైతం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగూరును ఖాళీ చేస్తే నీరు వృథా అయ్యే అవకాశాలే ఎక్కువ. మరోవైపు యాసంగి సాగు ఇంకా ప్రారంభం కాలేదు.
ప్రారంభమైనా కూడా తొలిదశలో నీటి అవసరాలు అంతంతగానే ఉంటాయి. ఒక్కో తడికి గరిష్ఠంగా ఒక టీఎంసీ చొప్పున వేసుకున్నా డ్యామ్‌ను నిర్ణీత 517.5 మీటర్ల లెవల్ వరకు ఖాళీ చేయాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. ఒక దశలో దిగువనున్న అన్ని ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను సింగూరు జలాలతోనే సమకూర్చాలని భావించినా అదీ కష్టసాధ్యమేనని తెలుస్తున్నది. మరింత ఆలస్యమైతే తదుపరి సీజన్ గడువులోగా మరమ్మతులు పూర్తిచేయడం ఇబ్బందిగా మారే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆయా అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. డ్యామ్‌ను ఖాళీ చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. ప్రస్తుతం సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.