కాలిఫోర్నియా: జాన్సన్ అండ్ జాన్సన్(Johnson & Johnson) కంపెనీకి కాలిఫోర్నియా కోర్టు భారీ జరిమానా విధించింది. ఇద్దరు మహిళలకు సుమారు 40 మిలియన్ల డాలర్లు చెల్లించాలని తన తీర్పులో ఆదేశించింది. ఆ కంపెనీకి చెందిన టాల్కమ్ బేబీ పౌడర్ వాడడం వల్ల తమకు ఒవేరియన్ క్యాన్సర వచ్చినట్లు ఆ ఇద్దరు మహిళలు కోర్టులో దావా వేశారు. కెంట్ అనే మహిళలకు 2014లో క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఇక 2018లో స్కల్జ్ అనే మహిళకు క్యాన్సర్ నిర్ధారించారు. ఇద్దరూ కాలిఫోర్నియా నివాసితులే. సుమారు 40 ఏళ్ల పాటు స్నానం చేసిన తర్వాత జాన్సన్ బేబీ పౌడర్ వాడినట్లు ఆ ఇద్దరు మహిళలు తమ కేసులో ఆరోపించారు. టాల్కమ్ పౌడర్ వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నదని, పలు మార్లు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని, కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు జాన్సన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.
జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులపై సుమారు 67 వేల మంది కేసు ఫైల్ చేశారు. బేబీ, టాల్కమ్ పౌడర్లతో క్యాన్సర్ వస్తున్నట్లు ఆరోపించారు. కానీ తమ ఉత్పత్తులు సురక్షితమైనవని కంపెనీ చెబుతున్నది. తమ ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ ఉండదని, క్యాన్సర్ రాదు అని కంపెనీ చెప్పింది. 2020 నుంచి అమెరికాలో జాన్సన్ కంపెనీ టాల్కమ్ పౌడర్‌ను అమ్మడం లేదు.