Akhanda 2 | బోయపాటి శ్రీను దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం థియేటర్లలో జోరుగా సందడి చేస్తోంది. తొలి భాగం ‘అఖండ’ సృష్టించిన సంచలనానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్‌పై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొనగా, విడుదల అనంతరం అవే అంచనాలను నిజం చేస్తూ సినిమా మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది. ముఖ్యంగా బాలయ్య నట విశ్వరూపం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అఘోర లుక్, పవర్ఫుల్ డైలాగ్స్, రుద్ర తాండవాన్ని తలపించే యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఇన్టెన్సిటీ థియేటర్లలో గూస్బంప్స్ తెప్పిస్తోంది. లాజిక్ కంటే ఎలివేషన్లకు ప్రాధాన్యం ఇచ్చే బోయపాటి మార్క్ టేకింగ్‌తో బాలయ్య పాత్రను దాదాపు ఓ సూపర్ హీరో స్థాయిలో ఆవిష్కరించారనే టాక్ వినిపిస్తోంది.
‘అఖండ’లో శివుడి ప్రస్తావన ప్రతీకాత్మకంగా ఉంటే, ‘అఖండ 2: తాండవం’లో ఆ భావనను మరింత విస్తరించారు. ఈ సీక్వెల్లో పరమేశ్వరుడి ఆవిర్భావమే కథలో కీలక మలుపుగా మారింది. అఖండ తల్లి మరణించే సమయంలో వచ్చే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. కైలాసంలో ఉన్న శివుడు స్వయంగా భూమిపైకి వచ్చి అఖండ తల్లి చితికి అగ్నిసంస్కారం చేసే ఘట్టాన్ని బోయపాటి అత్యంత భక్తిభావంతో, విజువల్ గ్రాండ్యూర్గా తెరకెక్కించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కలిసి ఆ ఎపిసోడ్‌ను భావోద్వేగంగా, ప్రత్యేకంగా నిలిచేలా చేశాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఈ కీలక సన్నివేశంలో శివుడి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ పాత్రను పోషించింది బాలీవుడ్ నటుడు తరుణ్ ఖన్నా. హిందీ టెలివిజన్ ప్రేక్షకులకు శివుడిగా సుపరిచితుడైన తరుణ్ ఖన్నా, ‘అఖండ 2’లోనూ అదే గంభీరతతో పరమేశ్వరుడిగా మెప్పించారు. 2015లో ప్రసారమైన మైథలాజికల్ సీరీస్ ‘సంతోషి మా’తో శివుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ‘కర్మఫల్ దాత శని’, ‘పరమావతార్ శ్రీ కృష్ణ’, ‘శ్రీమద్ రామాయణ’, ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘కాల్ భైరవ రక్షక్ శక్తిపీఠ్ కే’ వంటి పలు సీరియల్స్‌లోనూ అదే పాత్రలో నటించారు. శివుడిగా ఉన్న అనుభవం వల్ల ‘అఖండ 2’లో ఆయన అవలీలగా ఆ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. తరుణ్ ఖన్నా తెరపై అడుగుపెట్టిన ప్రతి సన్నివేశం థియేటర్లలో గూస్బంప్స్ తెప్పిస్తోందనే టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణతో నేరుగా సంభాషణ సన్నివేశాలు లేకపోయినా, క్లైమాక్స్‌లో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో తాండవం చేసే సీన్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులకు శివుడిగా తరుణ్ ఖన్నా మంచి పరిచయం ఉండటంతో, ఈ పాత్ర పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు మరింత కనెక్ట్‌ను తీసుకొచ్చిందని భావిస్తున్నారు.