నిరుద్యోగులు ఎత్తిన పిడికిళ్లపై లాఠీలు ఝుళిపించారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటున్న గొంతులు మూగబోయేలా పిడిగుద్దులు గుద్దారు. ‘న్యాయం చేయండి’ అంటూ రోడ్డెక్కిన నిరుద్యోగులను ఈడ్చి పడేశారు. ‘న్యాయం జరిగేంత వరకు కదలం’ అని భీష్మించిన నిరుద్యోగుల రక్తం కండ్లచూశారు. కనికరం లేకుండా రెక్కలు పట్టి ఈడ్చేశారు. కన్నీళ్లతో వేడుకుంటున్నా, కాళ్లతో తన్నుకుంటూ మెడలు పట్టి గెంటేశారు. ఒక్కొక్కరినీ నలుగురైదుగురు పోలీసులు చుట్టుముట్టి.. ఎత్తుకొని వ్యాన్లల్లో విసిరిపడేశారు. ఎక్కడికక్కడ నిర్బంధకాండను ప్రదర్శించారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు శుక్రవారం చేపట్టిన నిరుద్యోగ మార్చ్‌పై పోలీసుల దౌర్జన్యానికి ఇవే నిదర్శనాలు. అంతటి అణచివేతను తిప్పుకొడుతూ టీజీపీఎస్సీ ముట్టడిని ఎట్టకేలకు నిరుద్యోగ యువత విజయవంతం చేసింది.
Telangana | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ రాజ్యం విషపు కోరలు విప్పింది. అన్యాయానికి గురైన నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగింది. తమకు న్యాయం చేయాలని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి ఇచ్చిన పిలుపును అణచివేసేందుకు పోలీసులు జులుం ప్రదర్శించారు. చివరకు పోలీసు కుట్రలను ఛేదించుకుంటూ నిరుద్యోగి విజయం సాధించాడు. తన డిమాండ్లను ఎలుగెత్తి చాటాడు. ఈ క్రమంలో పోలీసులు సామాన్యులపైనా కర్రపెత్తనం చూపారు. నిరుద్యోగులను అణచివేసే కుట్రలో భాగంగా టీజీపీఎస్సీ ముట్టడికి సంబంధం లేనోళ్లనూ వ్యాన్లలో ఎక్కించి, పోలీసు స్టేషన్లకు తరలించారు. బాధితుల్లో రైతులు, లాయర్లు, చిరుద్యోగులు, జర్నలిస్టులు, మహిళలు, రోడ్డుపై కలిసి వెళ్లే భార్యాభర్తలు ఉన్నారు.
మెట్రో రైళ్లలో కనిపించిన 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులను సివిల్ డ్రెస్సుల్లో వచ్చిన పోలీసులు ఎక్కడిక్కడే అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులమని చెప్పి, కాలేజీ ఐడీ కార్డులు చూపినా పోలీసులు కనికరించలేదు. అరెస్టు చేసి, స్టేషన్లకు పంపారు. అసెంబ్లీ నుంచి నాంపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్న వారందరినీ అడ్డగించి, వివరాలు తెలుసుకొని, అరెస్టు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. శుక్రవారం రోజు నాంపల్లి వైపు రావడమే పాపమన్నట్టు పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నదని బాధితులు మండిపడుతున్నారు.
నాంపల్లిల్లో అప్రకటిత కర్ఫ్యూ
హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉద్యోగార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. టీజీపీఎస్సీ ముట్టడిని అడ్డుకునేందుకు దమనకాండ సాగించారు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద అప్రకటిత కర్ఫూ అమలు చేశారు. ముట్టడికి తరలివచ్చిన వారిపై విరుచుకుపడి అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యే క పికెట్లు వేసి నిరుద్యోగ యువత నాంపల్లి వైపు వెళ్లకుండా కాపుకాశారు.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక పికెట్లు నిర్వహించారు. ఉద్యోగార్థులు ఎక్కువగా నివాసముండే ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్, చిక్కడపల్లి, అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, హిమాయత్‌నగర్ ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేశారు. నగర నలుమూలాల నుంచీ నాంపల్లి వైపు యువత తరలివెళ్లకుండా వేలాది మంది పోలీసులు మోహరించారు. నాంపల్లి, మొ జాంజాహి మార్కెట్, గోషామహల్ ఇలా నలుదిక్కులా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
వృషణాలు పిసికిన పోలీసులు
‘మేం చెప్పినట్టు వినకుంటే ఎక్కడైనా (ప్రైవేట్ పార్ట్స్) పట్టుకుంటం, దేన్నీ లెక్క చె య్యం’ అంటూ టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద యువతపై పోలీసులు బెదిరింపులకు దిగిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్క ర్లు కొట్టాయి. బలవంతంగా ఓ యువకుడి వృషణాలు పట్టుకొని పోలీసులు లాక్కెళ్తుండగా ‘ఆగండాగండి’ అని ఆ యువకుడు అ రుస్తూ పోలీసులను ప్రాధేయపడిన దృశ్యా లు ఆ వీడియో ద్వారా బయటపడ్డాయి.