మధిర/చింతకాని/ఖమ్మం/ఖమ్మం లీగల్, అక్టోబర్ 24: ఖమ్మం జిల్లా చింతకాని మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మఫ్టీలో ఉన్న వైరా సర్కిల్ పోలీసులు ఐదు కార్లలో వచ్చి అయ్యప్ప మాల ధరించిన పుల్లయ్యను చింతకాని మండలం ప్రొద్దుటూరులోని ఆయన ఇంట్లో నుంచి బలవంతంగా లాక్కొచ్చి వాహనంలో ఎక్కించారు. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో పుల్లయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు..పార్టీ నాయకులతో కలిసి అక్రమ అరెస్టును నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కమల్‌రాజు వెంట మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొగ్గుల భాస్కర్‌రెడ్డి ఉన్నారు. పుల్లయ్య భార్య పెంట్యాల భారతమ్మ ఒక్కసారిగా కుప్పకూల డంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పుల్లయ్య అక్రమ అరెస్టును ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఖమ్మం మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గూని ప్రసాద్ విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఇటీవల షాక్ తగిలి మృతిచెందాడు. దీంతో అతడి మృతదేహంతో కొదుమూరు విద్యుత్తు సబ్ స్టేషన్‌కు బయలుదేరగా..వెంటవెళ్తున్న నరేశ్, పెంట్యాల పుల్లయ్య తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగించి చంపడానికి యత్నించారని నరేశ్, పెంట్యాల పుల్లయ్యతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ చేసి ఖమ్మం మూడవ అదనపు కోర్టుకు తరలించగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు.