హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విపక్ష పార్టీలు భ్రమల్లో బతుకుతున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. దశాబ్దాల పాటు పాలించి, ఏం చేశారో చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని, మతం పేరిట బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ఉన్న 60 లక్షల మంది గులాబీ సైనికుల బలం ముందు కాంగ్రెస్, బీజేపీ నిలువలేవని పేర్కొన్నారు. ఎవరెన్ని చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.