హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని అలకనంద దవాఖానలో బయటపడ్డ కిడ్నీ మార్పిడి మాఫియాకు కార్పొరేట్‌కు లింకులున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దవాఖానలో కిడ్నీలు మార్చేందుకు కావాల్సిన పూర్తి సౌకర్యాలు లేకపోవడంతో, దవాఖాన వెనుక ఏవైనా కార్పొరేట్ దవాఖానలు ఉన్నాయా అని పోలీసులు, వైద్య విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, విజయవాడ దవాఖానాల హస్తంపైనా ఆరా తీస్తున్నారు. కిడ్నీ మార్పిడి దందాలో దళారులుగా వ్యవహారిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీలు మార్చిన నెఫ్రాలజిస్ట్, అనస్తీషియా వైద్యులను గుర్తించారు. దళారులలో కొందరికి చాలాకాలంగా మాఫియాతో లింకులున్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. కిడ్నీ మార్పిడి మాఫియాతో సంబంధాలున్న బెంగళూర్‌కు చెందిన ఓ వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలిసింది.
చౌటుప్పల్‌కు చెందిన ఓ మహిళ కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇటీవల అలకనంద దవాఖానలో చేరింది. దవాఖానలో చికిత్స పొందుతూ జనవరి 2న చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దవాఖాన నిర్వాహకులు లక్షల రూపాయలు ముట్టజెప్పి రాజీ కుదుర్చుకున్నట్టు తెలుస్తున్నది. రాజీ వ్యవహారంలో స్థానిక రాజకీయనేతల ప్రమేయం కూడా ఉందని సమాచారం. దవాఖాన వద్ద గొడవ జరిగినా పోలీసులు, వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోలేదని పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
దేవరుప్పుల, జనవరి 23: యూట్యూబర్ భూక్యా రాజ్‌కుమార్‌కు బెయిల్ మంజూరైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్‌లో కథనాలను ప్రసారం చేశాడంటూ పాలకుర్తి పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేయగా 12వ తేదీన జైలుకు పంపారు. కాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కాగా దేవరుప్పులకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ధరావత్ రాంసింగ్, చింత రవి, జోగు సోమనర్సయ్య, వంగ అర్జున్ జనగామ జైలు వద్ద రాజ్‌కుమార్‌కు స్వాగతం పలికారు.