కాగజ్‌నగర్, మే 20 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లోని పెంచికలపేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఆడపులి చర్మం, గోర్లు, దవడలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఎఫ్డీపీటీ శాంతారాం తెలిపారు. మంగళవారం కాగజ్‌నగర్ అటవీ డివిజన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
ఈ నెల 13న బెజ్జూర్ మండల అటవీ ప్రాంతంలోకి వచ్చిన ఆడపులి పెంచికలపేట్ అటవీ ప్రాంతంలో పులి వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగలకు తగిలి ఈ నెల 14న మృత్యువాత పడిందని తెలిపారు. బెల్లంపల్లి కాగజ్‌నగర్ డివిజన్‌కు చెందిన అటవీ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో విచారణ చేపట్టి నిందితులను గుర్తించి విచారిస్తున్నట్టు వెల్లడించారు.
దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన శేఖర్ ఇంటి ఆవరణలో బాక్సుల్లో దాచిపెట్టిన పులి చర్మం, గోర్లు, దవడలు తదితర అవశేషాలతో పాటు వేటకు ఉపయోగించిన కరెంట్ తీగ, బైక్, కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కొద్దిరోజుల క్రితం సిర్పూర్ మండలం ఇటిక్యాలపహాడ్ అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించామని, ప్రస్తుతం కారిడార్‌లో ఎన్ని పులులు ఉన్నాయని స్పష్టం చేయలేమని తెలిపారు.