ములుగు, ఏప్రిల్ 27(నమస్తేతెలంగాణ) : ఆపరేషన్ కగార్‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల జాడ కోసం పోలీసు బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆదివారం 7వ రోజుకు చేరుకున్నది. తుపాకీ తూటాలు, బాంబుల శబ్దాలతో అడవి దద్దరిల్లుతున్నది. రాత్రింబవళ్లు సాగుతున్న ఈ కూంబింగ్‌లో కర్రెగుట్టల్లోని సొరంగాలు, గుహలు సవాల్‌గా మారినట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టలపై శాస్త్రీయంగా ఏర్పడిన గుహలతోపాటు మావోయిస్టులు ఏర్పర్చుకున్న సొరంగాలు అనేకం ఉన్నట్టు సమాచారం. కూంబింగ్ పార్టీలకు దొరకకుండా మావోయిస్టులు సొరంగాలు, గుహలలో తల దాచుకున్నట్టు కేంద్ర బలగాలు అనుమానిస్తున్నట్టు తెలిసింది. మావోయిస్టులకు కంచు కోట అయిన కర్రెగుట్టలను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నది. ఇటీవల ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందగా, వారి మృతదేహాలను బీజాపూర్‌కు తరలించారు. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 38 మంది మావోయిస్టులు హతమైనట్టు వార్తలు చక్కర్లు కొట్టగా దీనిపై పోలీస్ బలగాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పోలీసుల హిట్ లిస్టులో అగ్ర నాయకులు హిడ్మా, దేవలే టార్గెట్‌గా ఈ కూంబింగ్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. అడవిలోని అణువణువును పోలీసు బలగాలు తనిఖీలు చేస్తూ మావోయిస్టులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నట్టు సమాచారం.
హెలికాప్టర్, డ్రోన్లతో ముమ్మర గాలింపు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లోని రాష్ర్టాల సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న కర్రెగుట్టను ఆధీనంలోకి తీసుకున్న పోలీస్ బలగాలు కూంబింగ్‌ను సాగిస్తూ ముందుకు సాగుతూనే ఏరియల్ సర్వేలో భాగంగా హెలికాప్టర్, డ్రోన్లతో తనిఖీలు చేపడుతున్నాయి. ఏజెన్సీ ప్రాం తంలో ఏడు రోజులుగా హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. నిరుడు ఎన్నడూ లేని విధంగా పోలీస్ బలగాలు మావోయిస్టుల ఏరివేతను పకడ్బందీ ప్రణాళికతో ముందుకు కదులుతున్నట్టు తెలుస్తున్నది. వారంరోజులుగా కొనసాగిస్తున్న కూంబింగ్‌కు సంబంధించిన వివరాలు పోలీస్ అధికారులు బయటకు రానివ్వడం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుందో తెలియని పరిస్థితిలో ఏజెన్సీ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించండి ; సీఎం రేవంత్‌కు శాంతిచర్చల కమిటీ విన్నపం
మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని శాంతిచర్చల కమిటీ సీఎం రేవంత్‌రెడ్డిని కోరింది. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎంకు కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్‌లు వినతిపత్రం అందజేశారు. సీఎం మాట్లాడుతూ.. నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప.. శాంతిభద్రతల అంశంగా పరిగణించదని చెప్పారు. దీనిపై సీనియర్ నేత జానారెడ్డితోపాటు, మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు.