తొర్రూరు/మక్తల్, ఫిబ్రవరి 2: శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జనవరి 29న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె పాలకేంద్రం సమీపంలోని ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. అకడే ఉన్న పోలీసులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. కోడ్‌ను ఉల్లంఘిస్తూ రోడ్డుపై ఆందోళన చేపట్టారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ తొర్రూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు ఆయన అనుచరులు పసమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్, పల్లా సుందర్ రాంరెడ్డి, కల్వకొలను ప్రవీణ్‌రాజు, లకావత్ సురేశ్, ఈదురి ఐలయ్య, ధరావత్ గాంధీనాయక్, కుర్ర శ్రీనివాస్, చామకూరి ఐలయ్య, పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, రంగు కుమార్ తదితరులు కలిపి మొత్తం 33 మందిపై బీఎస్ఎస్ సెక్షన్లు 189(2), 223, 126(3), 132 ఆర్/డబ్ల్యూ 190 కింద కేసులు నమోదు చేసినట్టు తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు.
నారాయణపేట జిల్లాలో చిట్టెంపై..
కాగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆదివారం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం టైరోడ్డు వద్ద అంతర్రాష్ట్ర రహదారి 167పై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. వాహనాలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా, ప్రయాణికులకు సైతం ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నిస్తుండగా.. సీఐ రామ్‌లాల్ డ్రైవర్ దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లారు. దిష్టిబొమ్మ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రోడ్డుపై పడుకొన్నారు. చివరకు దిష్టిబొమ్మ అందించగా.. దహనం చేశారు. రోడ్డుపై పడుకున్న సందర్భాన్ని పోలీసులు ఆసరాగా తీసుకొని పోలీసుల విధులకు ఆటంకం, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారన్న నెపంతో కేసు నమోదు చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రోద్బలంతోనే మాజీ ఎమ్మెల్యే చిట్టెంతోపాటు మరో ముగ్గురు కార్యకర్తలపై అర్ధరాత్రి కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలీసుల తీరు దుర్మార్గం: ఎర్రబెల్లి
కాంగ్రెస్ నాయకుల అండతోనే పోలీసులు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్ అయ్యారు. వెలికట్ట శివారులో శాంతియుతంగా నిరసన చేపట్టామని తెలిపారు. ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. కోడ్ అమల్లో లేని ప్రదేశంలో ధర్నా చేస్తే కూడా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టంచేశారు. న్యాయపోరాటం చేస్తామ ని, జైలుకు పోవడానికి కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. జైలుకు వెళ్తే బెయిల్ కూడా తీసుకోనని, ఎన్ని రోజులైనా జైల్లోనే ఉంటానని చెప్పారు.
శాంతియుత మార్గంలో ధర్నా చేస్తే కేసులా? చిట్టెం
శాంతియుతంగా నిరసన చేపడితే కేసులు నమోదు చేయడం ఎక్కడా చూడలేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం ధర్నా చేపడితే బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. గతంలో రైతుల పక్షాన నిలబడి, రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయాలని శాంతియుత మార్గంలో ధర్నా చేస్తే ఇబ్బదులకు గురిచేశారని ఆరోపించారు. మాగనూరు పోలీస్ స్టేషన్లో రైతులతోపాటు నాయకులపై మంత్రి వాకిటి శ్రీహరి కేసు నమోదు చేయించారని గుర్తుచేశారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు ఎడాపెడా కేసులో నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.