నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణల కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు సమయం సరిపోలేదని, నిందితులను కస్టడీకి అప్పగిస్తే మరింత లోతుగా విచారిస్తామని పేర్కొన్నారు. నిందితుల తరఫు న్యాయవాదులు మంగళవారం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ముగ్గురు నిందితుల తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్లను సైతం దాఖలు చేసినప్పటికీ విచారణ పెండింగ్‌లో ఉంది.
సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి హరీశ్‌రావును మొదటి నిందితుడిగా, ఎస్ఐబీ మాజీ అధికారి రాధాకిషన్‌రావును రెండో నిందితుడిగా చేర్చారు. హరీశ్‌రావు, రాధాకిషన్‌రావును అరెస్ట్ చేయరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మిగతా ముగ్గురిని ఈ నెల 15న పోలీసులు అరెస్ట్ చేసి, 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా ఈ నెల 28వరకు రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.