ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి ఇలాకా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్లలో శుక్రవారం నిర్వహించిన అభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. మరోవైపు ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్మెంట్ నిర్వాసితులు యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ 65వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గూడ్స్ రైల్వే లైన్ కోసం భూములిచ్చేది లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో రైతులు ధర్నా చేశారు. పంట నష్ట పరిహారం కోసం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో రైతులు ధర్నాకు దిగారు. రుణమాఫీ, రైతుభరోసా కోసం గద్వాల కలెక్టరేట్ ఎదుట అన్నదాతలు ధర్నాతో హోరెత్తించారు. సెలవులు ఇవ్వకుండా తమ భర్తలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని కొండాపూర్ 8వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది భార్యలు తమ పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు.
ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలంటూ సచివాలయం ముందు ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యలను లాక్కెళ్తున్న పోలీసులు
Telangana | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్ల కానిస్టేబుల్స్ భార్యలు, వారి కుటుంబసభ్యులు శుక్రవారం సచివాలయాన్ని ముట్టడించారు. తమ భర్తలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, ఐదేండ్లు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.
మూడు నెలలకోసారి స్టేషన్లు మార్చుకుంటూ వెళ్తుంటే, పిల్లల చదువులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. తమ బాధలు అర్థం చేసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం తక్షణం తమకు న్యాయం చేయాలని సచివాలయం ప్రధాన ద్వారాల వద్ద వందలాది పోలీసు కుటుంబాలు గొంతెత్తి నినదించాయి. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు ఆందోళనలు చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
పసిబిడ్డలతో మండుటెండలో పోలీసు ఉన్నతాధికారులకు తమ గోడు వెలిబుచ్చుకున్నారు. దీంతో అప్పటికప్పుడు స్పెషల్ఫోర్స్ను రప్పించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. చంకలో పసి బిడ్డలున్నా కనికరించకుండా ఈడ్చి వ్యాన్లలో పడేశారు. అరెస్టు చేసిన వారిని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ గోడు చెప్పుకుందామని వస్తే.. అరెస్టు చేస్తారా అంటూ కొందరు మహిళలు భోరున విలపించారు. ‘అయ్యా ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి.. మా భర్తలను మమ్మల్ని వేరుచేయకండి’ అంటూ కన్నీటితో వేడుకున్నారు. సాయంత్రం కూడా సచివాయలం ముట్టడిస్తామని బాధిత కుటుంబాలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రత్యేక బలగాలను అందుబాటులో ఉంచారు.
తేమ పేరిట పత్తి కొనుగోళ్లను నిరాకరించవద్దని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ వద్ద కలెక్టర్ రాజర్షి షాను అడ్డుకొని పత్తి కొనుగోలు చేయాలని కాళ్లు మొక్కుతున్న రైతు
కొండాపూర్‌లోని 8వ పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు కొండాపూర్ ప్రధాన రహదారిలో ఆందోళన చేపట్టారు. వీరిని గచ్చిబౌలి పోలీసులు బెదిరించినట్లు సమాచారం. నిరసన తెలుపుతున్న మహిళల ఫోటోలు తీసుకుని, తర్వాత మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు బెటాలియన్ ప్రధాన ద్వారం మరోసారి బైఠాయించారు. గచ్చిబౌలి పోలీసులు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. బెటాలియన్ కమాండెంట్ సన్నీ అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు.
తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యల ఆందోళనలకు ప్రభుత్వం దిగొచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ 26 రోజుల డ్యూటీ విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ శుక్రవారం సర్క్యూలర్ విడుదల చేశారు. కమాండెంట్లు అందరూ ఆయా బెటాలియన్లలోని సిబ్బందితో తక్షణం దర్బార్ నిర్వహించాలని ఆ సర్క్యూలర్‌లో ఆదేశించారు. అలాగే వారి ఫిర్యాదులు, ఇతర సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆందోళనలు జరగడం, ప్రజలు, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో సర్కారు వెనక్కి తగ్గింది.
పోలీసు కుటుంబాల నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి, ప్రజల్లోనూ వస్తున్న వ్యతిరేకతపై టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ స్పందించారు. ఈ మేరకు ఆ విభాగం అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ‘సెలవులు/అనుమతులకు సంబంధించిన ఆర్డర్.. కొంత బాధను, గందరగోళాన్ని కలిగించిందని నేను విన్నాను. మీ సమస్యలను అర్థం చేసుకున్నాను. అందుకే ఆ ఆదేశాలను రద్దు చేశాను. కమాండెంట్లందరూ మీ అందరితో మాట్లాడి సమస్యలను అర్థం చేసుకోవాలని, మీ నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని ఆదేశించాను. నా పోలీసు కుటుంబాలు, అధికారులు, వారి కుటుంబాల సంక్షేమం నాకు చాలా ముఖ్యమైనది. వాటికి పరిష్కారం కనుగొనేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏవైనా వ్యక్తిగత ఫిర్యాదులు ఉంటే, మీరు నేరుగా tgspcontrol@gmail.com మెయిల్‌కు, వాట్సాప్ అండ్ గ్రీవెన్స్ నంబర్ 8712658531 నంబర్‌కు సంప్రదించండి.’ అంటూ సంజయ్‌కుమార్ జైన్ కోరారు.