ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనే అంశం నుంచి ఇంటర్వ్యూ వరకు ప్రతి దశలో పక్కా ప్రణాళిక-వ్యూహంతో ముందుకు సాగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రాష్ట్ర సర్కారు ప్రకటించిన భారీస్థాయి ఉద్యోగాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థులకు ప్రతీ మార్కు అత్యంత కీలకమనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటీ పరీక్షలపై దృష్టిసారించిన నేపథ్యంలో సివిల్ సర్వీస్ అభ్యర్థులకు వాట్సాప్ గురు ద్వారా ప్రత్యేక కోచింగ్ ఇప్పించిన సీపీ మహేశ్ భగవత్‌ను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగార్థులకు కీలక సూచనలు చేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
– హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి
ఆసక్తి ఉన్న ఉద్యోగాలకే సిద్ధమవ్వాలి
సీఎం కేసీఆర్ ఒకేసారి 90 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రకటన చేశారు. నాకు తెలిసి, నా కెరీర్లో ఒక ప్రభుత్వం ఇంత భారీస్థాయిలో రిక్రూట్మెంట్ ఒకేసారి చేపట్టడం నేను చూడలేదు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశం. రిక్రూట్మెంట్లో భాగంగా జారీ అయ్యే నోటిఫికేషన్లలో యువతకు అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అర్హత ఉంటుంది. అందుకే ముందుగా ఏ ఉద్యోగం అంటే ఆసక్తి ఉన్నది? ప్రధానంగా పోలీసు శాఖ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్యం, ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించే సామర్థ్యం ఉన్నదా? అనేది పరిశీలించుకోవాలి. ఆ తర్వాతే ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సై లాంటి ఉద్యోగాల్లో చాలామంది అభ్యర్థులకు విషయ పరిజ్ఞానం ఉంటుంది కానీ ఈవెంట్స్‌లో వెనకబడిపోతారు. అటు ఇతర ఉద్యోగాలకు సిద్ధం కాలేక, ఇటు ఎస్సై ఉద్యోగానికి అర్హత సాధించ లేకపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఉద్యోగ ఎంపికలోనే జాగ్రత్త వహించాలి.
కోచింగ్‌తో ప్రయోజనాలు
పోటీపరీక్షలకు ఒంటరిగా సిద్ధమవటం కంటే కోచింగ్ తీసుకొంటూ, బృందంగా సిద్ధమైతేనే ప్రయోజనాలుంటాయి. కోచింగ్ తీసుకోవడం వల్ల ఫ్యాకల్టీ ద్వారా అందే సమాచారం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వారు నిర్వహించే ప్రిపరేషన్ ఎగ్జామ్స్‌తో మన ప్రతిభ ఎంత అనేది ముందుగానే తెలుస్తుంది. ఇంకా మెరుగుపడే అవకాశం దొరుకుతుంది. బృందంగా చదవటం, చర్చ చేయటం వల్ల ఎక్కువ విషయాలు తెలిసి, గుర్తుంటాయి.
వ్యూహాత్మకంగా ప్రిపరేషన్
ఉద్యోగార్థులు సబ్జెక్టులవారీగా సిద్ధమవుతున్నపుడు పీహెచ్డీ చేసేందుకు కాదు.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నామనే విషయాన్ని గుర్తించాలి. మార్కులు ఎలా సాధించాలనే కోణంలో వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. అందులో భాగంగా 80:20 విధానాన్ని పాటించాలి. సివిల్స్‌కు సిద్ధమయ్యే అభ్యర్థులు పాటించే ఈ విధానాన్ని ‘పరాటో’ సూత్రం అంటారు. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి గతంలోని పరీక్ష పత్రాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. మూల్యాంకనాన్ని విశ్లేషించాలి. ఏ అంశంపై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయనేది గుర్తించాలి. ఇలా 20 శాతం కష్టపడితే 80 శాతం ఫలితాలు వస్తాయి. అందుకే దీనిని 80:20 విధానం అంటారు. గ్రూప్-1, గ్రూప్-2 మొదలు కానిస్టేబుల్ పోటీ పరీక్షల వరకు అభ్యర్థులు ఇదే రీతిలో వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించుకోవాలి.
దినచర్య ఎలా ఉండాలంటే..
ప్రతి ఉద్యోగార్థిలో మెదిలే సందేహం.. రోజుకు ఎన్ని గంటలు చదవాలి? అని. దీనికి సమాధానమే 8+10+6. రోజులో కచ్చితంగా 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. 10 గంటలు ప్రిపరేషన్ ఉండాలి. ఈ పది గంటల్లో కేవలం చదవడంతో పాటు పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం, నోట్స్ రాసుకోవడం వంటివి చేయాలి. ముఖ్యంగా నోట్స్ రాసుకోవడం వల్ల రివిజన్ జరగడమే కాదు.. మీ చేతి రాతతో ఉన్న అక్షరాలు మీకు గుర్తుండటం సులువు. పది గంటల్లో కనీసం రెండు గంటలు రాస్తే బాగుంటుంది. నేను సివిల్స్‌కు సిద్ధమైనపుడు రేపు పరీక్ష అనగా, ముందురోజు రాత్రి ఎక్కువ సమయం రాయడంపైనే దృష్టిపెట్టాను. దీని ద్వారా విషయం గుర్తుండటంతో పాటు పరీక్షలో సులువుగా రాయగలరు. పెన్ వేగంగా కదులుతుంది. ఇక, 6 గంటలు టీవీ చూడటం, సినిమా చూడటం, పత్రికలు చదవడం, గ్రూప్ డిస్కషన్ చేయడం వంటివి చేయాలి. చదవడంలోనూ ఒక ప్రణాళిక ఉండాలి. కఠినంగా అనిపించే సబ్జెక్ట్‌ను మీరు, మీ పరిసరాలు ప్రశాంతంగా ఉన్నప్పుడే చదవాలి. ఇంట్లో సందడి, బయట రణగొణ ధ్వనులు ఉండే సమయంలో సులువైన సబ్జెక్టును చదవాలి.
అన్ని కోణాల్లో తెలంగాణపై పట్టుండాలి
పోటీ పరీక్షల్లో ‘తెలంగాణ’పై అనేక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, సామాజిక తెలంగాణపై విషయ పరిజ్ఞానాన్ని సాధించాలి. తెలంగాణను 1948-70, 1971-90, 1991-2014.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిణామాలుగా విభజించి ప్రిపేర్ కావాలి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, పథకాలు (ఫ్లాగ్షిప్) మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, ఆసరా, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, కేసీఆర్ కిట్.. ఇలా అన్నిరకాల అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను గుర్తుంచుకోవాలి. సమాచారాన్ని సంబంధిత పుస్తకాలతో పాటు ప్రభుత్వ శాఖల వెబ్సైట్లో నుంచి తీసుకోవాలి. గూగుల్ సెర్చ్‌లోని అంశాలను ప్రామాణికంగా తీసుకోవద్దు. నావంతుగా.. వాట్సాప్ గురు ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కు శిక్షణ ఇస్తా.