Command Control Centre | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున గత ప్రభుత్వ హయాంలో శత్రు దుర్బేధ్యంగా, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) రాజకీయ సమీక్షలకు అడ్డాగా మారిందా? నిన్న మొన్నటి వరకూ కేసీఆర్, సచివాయంపై సూక్తులు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి వాస్తు భయంతో అటువైపు కన్నెత్తి చూడటంలేదా? కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను.. కాంగ్రెస్ కమాండ్ సెంటర్‌గా మార్చారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నిరుడు మే నెలలో తొలిసారిగా పోలీస్ కమాండ్ సెంటర్లోకి అడుగుపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడ గత ప్రభుత్వం కల్పించిన ఆధునిక వసతులను చూసి ఆశ్చర్యపోయారు. దాని పరిసర ప్రాంతాల్లో పోలీసుల నిఘా, క్షుణ్ణంగా తనిఖీలు, పూర్తి వివరాలు ఉంటేనే అనుమతుల విధానాలను తెలుసుకున్నారు. నాటి నుంచి అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
గత ప్రభుత్వం సదుద్దేశంతో నిర్మించిన ఈ ఐకానిక్ బిల్డింగ్‌లో రాజకీయ సమీక్షలు సైతం చేస్తుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ సీఎంకు, హోంమంత్రికి, ఇతర సంబంధిత శాఖల మంత్రులకు, డీజీపీకి, ఇతర డీజీలకు, నగర కమిషనర్లకు, ఆయా విభాగాల సిబ్బందికి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా క్యాబిన్లు సైతం ఉన్నాయి. అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు, అత్యవసరమైతే హెలిప్యాడ్ ల్యాండ్ అవడానికి, వెళ్లడానికి వీలు ఉంటుంది. దీంతోపాటు తెలంగాణలోని 60 శాతం సీసీ కెమెరాలను ఇక్కడి నుంచే మానిటర్ చేసే వ్యవస్థ సైతం ఉన్నది. అందుకే సచివాలయంలో సమీక్షలకు స్వస్తి చెప్పి.. సీసీసీలోనే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది.
హైదరాబాద్‌లోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పాలకులు తమ పార్టీ రాజకీయ కార్యకలాపాలకూ వదికగా చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డితో ఎన్నికల అంశాలు, ఆయా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడే చర్చించడం గమనార్హం. సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల బాధ్యతను ముగ్గురు మంత్రులకు అప్పగించినట్టు స్వయంగా మీడియాతో చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆతిథ్యంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్‌పైనా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే సీఎం రేవంత్‌రెడ్డి సహచర మంత్రులతో సమీక్షించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి రాగాలపై ముఖ్యమంత్రి సీరియస్‌గా చర్చించినట్టు తెలిసింది. వారితోపాటు పార్టీ రమైన ఇతర అంశాలు, ముఖ్యంగా ‘కమీషన్’ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తీరుపై సీసీసీలోనే సమీక్షించినట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి నెలలో కనీసం మూడుసార్లు ఈ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే మంత్రులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాస్తు భయంతో సచివాలయ ప్రధాన ద్వారం, తన క్యాబిన్లో మార్పులు చేపట్టిన సీఎం.. సచివాలయానికి దూరంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై కొందరు ఉన్నతాధికారులను ఓ విచిత్రమైన సమాధానం ఇవ్వడం గమనార్హం. సచివాలయంలో నిర్వహించే సమీక్షలు, ఇతర సమావేశాల వివరాలు క్షణాల్లో బయటకు పొక్కుతున్నాయని, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించే సమీక్షలు అత్యంత రహ్యంగా ఉంటున్నాయని, అందుకే సీఎం ఇక్కడి సమీక్షలకు ప్రాధాన్యం ఇస్తున్నారని సెలవిచ్చారు. దీంతో ప్రభుత్వ అంశాలైనా, పార్టీ అంశాలైనా ఐసీసీసీ సురక్షిత ప్రాంతమని పోలీస్ పహారా నడుమ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షలు చేపడుతున్నారని అంటున్నారు.