నీలగిరి, మే 30 : రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఆశ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన పరశురామ్ మహిమల చెంబుల పేరుతో ప్రజలను నమ్మించి సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచించాడు.
హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ, నాగరాజు, మురళి, లక్ష్మణ్, మహబూబ్‌నగర్‌కు చెందిన సందుల రవితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు కల్వకుర్తి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, దేవరకొండ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడ్డారు. ఏప్రిల్ 11న లక్ష్మణ్, సందుల రవి.. మహిమల చెంబు పేరుతో నల్లగొండకు చెందిన శ్రీనివాస్‌కు అప్పగించగా, అతను వారికి 4.60 లక్షలు చెల్లించాడు. అనంతరం మోసపోయినట్టు గ్రహించి, ఏప్రిల్ 26న పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దర్యాప్తుచేసిన పోలీసులు సోమవారం నల్లగొండలో లక్ష్మీనారాయణ, నాగరాజు, మురళి, లక్ష్మణ్, రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.