డీజీపీ, పోలీసు వ్యవస్థపై అసభ్య వ్యాఖ్యలు సరికాదు
పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్
హైదరాబాద్/సిటీబ్యూరో, ఫిబ్రవరి 19: డీజీపీ మహేందర్‌రెడ్డిపై, పోలీస్ వ్యవస్థపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెనక్కి తీసుకొని, క్షమాపణ చె ప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ‘ఫోన్ చేస్తే లైన్లకు కూడా రారా.. మీకు ఇంత అహంకారమా.. ఇంత బలుపా.. మీ నెత్తిమీద ఉన్న టోపీ ప్రజలు ఇచ్చింది.. నీకేమాత్రం సిగ్గుశరం ఉన్నా రాజీనామా చేయ్..’ అంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇలా ఎవరైనా మాట్లాడారా? లక్షల మంది పోలీసులతో, నాలుగు లక్షల మంది కుటుంబసభ్యులతో ఉన్న మేము మాట్లాడలేమా? రాజకీయం కోసం ఇంత సంస్కారరహిత భాష వాడవచ్చా?’ అని శనివారం ఒక ప్రకటనలో నిలదీశారు. రేవంత్‌రెడ్డి అహంకారపూరిత స్వభావాన్ని వదిలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించాలని సూచించారు.