మెదక్ అర్బన్, జనవరి18: ఎయిర్టెల్ సెల్ టవర్లలో బేస్‌బ్యాండ్ యూనిట్లను దొంగిలించి ఢిల్లీ, బంగ్లాదేశ్‌లలో విక్రయిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చేగుంట మండలం రామాంతపూర్, రాంపూర్‌లోని సెల్ టవర్ల వద్ద రూ.25 లక్షల విలువైన బేస్‌బ్యాండ్ యూనిట్లు చోరీకి గురయ్యాయని ఈ నెల 13న ఎయిర్టెల్ సెల్‌టవర్ పెట్రోలింగ్ ఉద్యోగి నాగరాజు చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మాసాని మహేశ్ ఎయిర్టెల్ బేస్‌బ్యాండ్ యూనిట్ల సప్లయర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనితో కలిసి అదే జిల్లాకు చెందిన సంతోష్‌రెడ్డి, రత్నాకర్‌రెడ్డి, రాజుగౌడ్ ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి హైదరాబాద్‌కు చెందిన మాసాని అనిల్, మహ్మద్ అఫ్రోజ్, కామారెడ్డికి చెందిన పాగిడిపల్లి అశోక్ బేస్‌బ్యాండ్ యూనిట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఢిల్లీ, బంగ్లాదేశ్‌లలో విక్రయిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు నిందితులు మాసాని బాగులు, మాసాని శేఖర్, మహ్మద్ అబ్బు, చాంద్‌లు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. నిందితులపై 26 కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితుల నుంచి రూ.6.75 లక్షల విలువ గల సామగ్రి, మూడు కార్లు, బైక్, ఏడు సెల్ ఫోన్లను రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన తూప్రాన్ డీఎస్పీ యాదగరిరెడ్డి, రామాయంపేట సీఐ, చేగుంట, తూప్రాన్ ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.