హైదరాబాద్‌లోని సైదాబాద్ మండలంలో 17 రోజుల క్రితం గంజాయి మత్తులో ఓ యువకుడు అభంశుభం తెలియని 8 ఏండ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు కూలికి వెళ్లగా.. స్కూల్ నుంచి వచ్చిన ఆ చిన్నారిపై తమ్ముడి ముందే పశువులా ప్రవర్తించాడు. పైగా తన దురాగతాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ బాలిక కుటుంబం ఉంటున్న పరిసరాల్లో ఎంతో మంది యువకులు గంజాయికి బానిసలై ఆ మత్తులో పలు దారుణాలకు పాల్పడుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు.
హైదరాబాద్‌లోని నేరేడ్‌మెంట్ ప్రాంతంలో నిరుడు జూన్ 26న ఐదుగురు యువకులు గంజాయి మత్తులో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికకూ గంజాయి అలవాటు చేశారు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత అఘాయిత్యానికి పాల్పడే వారు. కొన్ని నెలల తర్వాత ఆ బాలిక శరీరంలో మార్పులు గమనించి తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఆ యువకుల దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు దారుణాలు హైదరాబాద్‌లోనే జరగడం గమనార్హం.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యువతను మాదకద్రవ్యాల మత్తు కమ్మేస్తున్నది. ఆ మత్తులో కొందరు దుర్మార్గుల కండ్లు మూసుకుపోతున్నాయి. నిషాలోకంలో విహరిస్తూ చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. మహిళలను చెరబడుతున్నారు. రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని చితక్కొడుతున్నారు. అమ్మాయిలకు సైతం డ్రగ్స్ అలవాటు చేసి, వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ దుర్మార్గులపై నమోదవుతున్న కేసులు, వారిపై చేపడుతున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఏదైనా దారుణం వెలుగులోకి వచ్చే వరకూ పోలీసులు, ఈగల్ (EAGLE) బృందాలు, ఎక్సైజ్ పోలీసులు మిన్నకుండి చూస్తున్నారు. అడపాదడపా దాడులతో సరిపెడుతూ.. మత్తు మూలాలను వదిలేస్తున్నారు. ఎక్కడైనా గంజాయి, ఇతర డ్రగ్స్ దొరికితే రెండ్రోజులు హడావుడి చేసి సరిపెడుతున్నా రు. నిందితులు, డ్రగ్స్ పెడ్లర్లపై కఠిన చర్యలు చేపట్టడంలో తీవ్రంగా విఫలమవుతున్నారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల కేసులు భారీగా పెరిగిపోయాయి. నిరుడు ఈ కేసుల్లో ఏకంగా 5,965 మంది అరెస్టయ్యారు. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికం. ఈ ఏడాది కూడా ఆగస్టు వరకు 1,612 కేసుల్లో 3,412 మందిని అరెస్టు చేశారు. మరో 1,876 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ప్రతి 10 మంది యువతలో ఇద్దరికి దుర్వ్యసనాలు ఉన్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. జువెనైల్ హోమ్స్‌లోని బాల నేరస్తుల్లో 90% మందికిపైగా గంజాయికి బానిసలయ్యారని, వీరిలో చాలామంది చిన్న చిన్న దొంగతనాల నుంచి తీవ్రమైన నేరాల వైపు మళ్లుతున్నారని వెల్లడైంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈగల్, ఎక్సైజ్, పోలీసులు, వైద్యారోగ్యశాఖలు, కేంద్ర నిఘా సంస్థలు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ విభాగాల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తున్నది.
గంజాయి, ఇతర డ్రగ్స్ తీసుకుంటున్న యువకులు తమ ప్రాంతాల్లోని స్థానికులపై దాడులకు దిగి తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పల్లెల్లో వీరి ఆగడాలు అనేకం. స్కూళ్లు, పాడుబడ్డ బంగ్లాలు, స్మశానాలు, చెరువు గట్లు, రైల్వే ట్రాక్‌లు తదితర నిర్జన ప్రదేశాల్లో అర్ధరాత్రుల వరకూ మద్యం తాగుతూ, గంజాయి సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. మత్తులో జోగుతూ నడిరోడ్లపై కొట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 334.69 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2023లో రూ.94.39 కోట్లు, నిరుడు రూ.139.69 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడగా.. ఈ ఏడాది ఆగస్టు వరకే రూ.68.16 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ, డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిఘా సంస్థలు విఫలమవుతున్నాయి. నిందితులపై చార్జిషీట్లు దాఖలు చేయడంలో అలసత్వం వహిస్తున్నాయి. పీడీ యాక్టు కింది ఒక్క పోలీసుశాఖ ద్వారానే 2020లో 46 మంది, 2021లో 152 మంది, 2022లో 218తో కలిపి.. మొత్తం కలిపి 416 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. వారిలో ఎంత మందిపై చర్యలు చేపట్టారో వెల్లడించేందుకు సంబంధిత విభాగాలు సుముఖంగా లేకపోవడం గమనార్హం.