హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బ్రాండెడ్ మందులను పోలిన నకిలీ ఔషధాలను మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.26 లక్షల విలువైన నకిలీ ఔషధాను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ నుంచి నకిలీ ఔషధాలు రవాణా అవుతున్నట్టు డీసీఏ అధికారులకు సమాచారం అందింది. హనుమకొండ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జే కిరణ్ దర్యాప్తు జరిపి, శుక్రవారం డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ అంజుం ఆబిదా, ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, రవికుమార్, అనిల్, క్రాంతికుమార్, రాజు, నాగరాజుతో పలుచోట్ల దాడులు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ నుంచి ‘ట్రాక్ ఆన్ కొరియర్స్’ వాహనంలో దిల్‌సుఖ్‌నగర్‌కు రెండు పార్సిల్స్ వచ్చినట్టు గుర్తించారు. వాటిపై యంత్రాల విడిభాగాలు అని రాసి ఉన్నా, లోపల మాత్రం దాదాపు 18 కిలోల నకిలీ ఔషధాలు ఉన్నట్టు నిర్ధారించారు. వీటిని తెప్పించిన పువ్వాడ లక్ష్మణ్ అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాపురంలో అతడు నిర్వహిస్తున్న గోదాములో తనిఖీలు చేయగా, పెద్ద ఎత్తున నకిలీ ఔషధాలు దొరికాయి. ఎనిమిది రకాల కంపెనీల పేర్లతో వీటిని తయారు చేసినట్టు గుర్తించారు. లక్ష్మణ్‌కు సాయం చేసిన సైదాబాద్‌కు చెందిన పోకల రమేశ్, గారపల్లి పూర్ణచందర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో నదీమ్ అనే వ్యక్తి ఈ నకిలీ ఔషధాలను తయారు చేస్తున్నట్టు తెలుసుకొని, అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.
నిందితులు నకిలీ ఔషధాలు తయారు చేసి సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మా, టొరెంట్ ఫార్మా వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో లేబుల్ వేసినట్టు గుర్తించారు. దీంతోపాటు ఎంపీవోడీ-200, మెక్స్క్లావ్-625 పేర్లతో రెండు రకాల యాంటీ బయాటిక్స్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ‘మెగ్ లైఫ్ సైన్సెస్’గా పేర్కొన్నారని, అదొక నకిలీ కంపెనీ అని చెప్పారు. ఈ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.